
ప్రజాశక్తి-కపిలేశ్వరపురం(కోనసీమ) : రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దెదించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. ఆదివారం కపిలేశ్వరపురం మండలంలోని వడ్లమూరు గ్రామంలో గ్రామ టిడిపి అధ్యక్షుడు గజ్జరపు కామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన బాబుతో నేను కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటికి పర్యటించి వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న కక్ష సాధింపు చర్యలను, ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజలకు వివరించారు. అభివద్ధి లక్ష్యంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ను జగన్ ప్రభుత్వం పథకం ప్రకారం అరెస్టు చేయించారని త్వరలోనే ఆయన ప్రజల ఆశీస్సులతో కడిగిన ముత్యంలా బయటికి వస్తాదన్నారు. టిడిపి మేని ఫెస్టోను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. గ్రామంలో పర్యటించిన ఆయనకు అడుగడుగునా మహిళలు హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.