Oct 24,2023 09:57

సంగారెడ్డి (తెలంగాణ) : ' వచ్చే పదేళ్లలో తెలంగాణకు ముఖ్యమంత్రినవుతా ' అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం విజయదశమి ఉత్సవాల్లో భాగంగా ... సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో జగ్గారెడ్డి మాట్లాడుతూ ... వచ్చే పదేళ్లలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. విజయదశమినాడు తన మనసులో మాట చెబుతున్నానన్నారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీన్ని ఎవరైనా కాదనగలరా ? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తన నోరు, చేతులు కట్టేశారని లేకపోతే మరిన్ని విషయాలను పంచుకునేవాడినని ఆరోపించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని అన్నారు. నియోజకవర్గంలో తాను అందుబాటులో లేకపోయినా తన భార్యతో పాటు అనుచరులు ఉంటారన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి వాలిపోతానని, ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ తనపై ఉండాలని కోరారు.