Sep 10,2023 12:14

విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన చిత్రం 'ఖుషి'. టక్‌ జగదీష్‌ తర్వాత ఈ చిత్రంతో ముందుకొచ్చారు దర్శకుడు శివ నిర్వాణ. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాని ప్రకటించడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. సంగీతం, పాటలు సినిమా కన్నా ముందుగా విడుదలై, అభిమానులకు వినోదాన్ని పంచాయి. ట్రైలర్‌లో విజయ్, సమంత మధ్య ప్రేమ, సన్నివేశాలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఒక ఆస్తిక కుటుంబానికి చెందిన అమ్మాయి, నాస్తిక కుటుంబానికి చెందిన అబ్బాయి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం ఇది.

/Love-is-the-greatest-Khushi

నటీనటులు : విజయ్ దేవరకొండ, సమంత, సచిన్‌ ఖేడ్కర్‌, శరణ్య పొన్నవణ్ణన్‌, మురళీశర్మ, రోహిణి, వెన్నెల కిషోర్‌, జయరామ్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు
రచన, దర్శకత్వం : శివ నిర్వాణ
సంగీతం : హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌
నిర్మాత : నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌

కథలోకి వెళితే.. లెనిన్‌ సత్యం (సచిన్‌ ఖేడేకర్‌) ఓ నాస్తికుడు. సైన్స్‌ని నమ్మాలని, మూఢ నమ్మకాలతో మోసపోవద్దని ప్రచారం చేస్తుంటాడు. అతని భార్య రాజ్యలక్ష్మీ (శరణ్య) మాత్రం భర్తకు తెలియకుండా పూజలు చేస్తుంటుంది. ఇక అతని చిన్న కొడుకు విప్లవ్‌ (విజయ్ దేవరకొండ) కూడా నాస్తికుడే. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం రావడంతో అడిగి మరి కాశ్మీర్‌లో పోస్టింగ్‌ వేయించుకుంటాడు. అక్కడ ఆరా బేగం (సమంత) ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తాను పాకిస్తాన్‌కు చెందిన ముస్లిం అమ్మాయి అని తెలిసినా.. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. విప్లవ్‌ చూపించే ప్రేమకు ఆరా బేగం కూడా ప్రేమిస్తుంది. అప్పుడు తాను ముస్లిం అమ్మాయిని కాదని, బ్రాహ్మిన్‌ అమ్మాయిని అని, తన అసలు పేరు ఆరాధ్య అని చెబుతుంది. కాకినాడకు చెందిన ప్రవచనకర్త చదరంగం శ్రీనివాసరావు (మురళీ శర్మ) తన తండ్రి అని చెబుతుంది. చదరంగం శ్రీనివాసరావుకు, లెనిన్‌ సత్యంకు అసలు పడదు. ఒకరు దేవుడిని, జోతిష్యాన్ని నమ్మితే.. మరొకరు సైన్స్‌, టెక్నాలజీని నమ్ముతారు. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకోరు. పెద్దలను ఎదిరించి, ప్రేమ పెళ్లి చేసుకుంటారు విప్లవ్‌, ఆరాధ్య. ఆ తర్వాత వీరి మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు వస్తాయి. ఇద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటి? విడిపోతారా? కలిసే ఉన్నారా? చివరకు ఏం జరిగింది? అనేది అసలు సినిమా.

ప్రేమ, పెళ్లి అంటే ఒకరిపై మరొకరికి నమ్మకం. ఎన్ని గొడవలు వచ్చినా విడిపోవడం అనేది సరైన నిర్ణయం కాదని, చివరివరకూ కలిసి జీవించడమే ప్రేమపెళ్లికి అసలైన నిర్వచనమని ఈ చిత్రం సందేశం. ఇటువంటి సినిమాలు గతంలో 'ముంబాయి, సఖి' వచ్చాయి. మంచి కథ అయినా భావోద్వేగాల్ని తారాస్థాయికి తీసుకెళ్లి పండించడం, తగుపాళ్లల్లో డైలాగ్స్‌ చెప్పడం వల్ల ఆడియన్స్‌ పూర్తిస్థాయిలో మెచ్చుతారు. కానీ ఈ సినిమాలో అక్కడక్కడ కొన్ని కొరవడ్డాయి. అటు ప్రేమికులకు, ఇటు భార్యాభర్తలకీ కనెక్టయ్యే సినిమా. ప్రథమార్ధంలో ప్రేమ, పెళ్లి హాయిగా సాగినా.. ద్వితీయార్ధంలో సన్నివేశాలు సాగదీతలా అనిపిస్తాయి. ఫెర్టిలిటీ సెంటర్‌లో టెస్టుల కోసం హీరో ఆస్పత్రికి వెళ్లే సీన్‌ అతిగా అనిపిస్తుంది. ఇక చివరి 30 నిమిషాలు అయితే కథ ఎమోషనల్‌గా సాగుతుంది. సైన్స్‌, దైవనమ్మకాల కంటే ప్రేమ గొప్పదని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. క్లైమాక్స్‌ రొటీన్‌గా ఉంటుంది. పాటలు.. అందమైన లొకేషన్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేశాయి.

ఎవరెలా చేశారంటే : విజయ్ దేవరకొండ, సమంత జోడీ ప్రతి సన్నివేశంలోనూ ఆకట్టుకుంటుంది. కథకి తగ్గ జంటగా కనిపించారు. ప్రేమలో పడిన జంటగా ప్రథమార్ధంలో ఎంత అందంగా కనిపించారో, ద్వితీయార్ధంలో భార్యాభర్తలుగా సహజంగా ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రతి సన్నివేశంలోనూ చక్కటి భావోద్వేగాల్ని పండించారు. సచిన్‌ ఖేడేకర్‌, మురళీశర్మ పాత్రలు సినిమాకి కీలకం. ఒకరు నాస్తికుడిగా, మరొకరు ప్రవచనకర్తగా పాత్రల్లో జీవించారు. జయరాం, రోహిణి పాత్రలకి తగ్గట్టుగా నటించారు. ఫస్టాఫ్‌లో వెన్నెల కిశోర్‌ కొన్ని నవ్వులు పంచితే, ద్వితీయార్ధంలో రాహుల్‌ రామకృష్ణ సందడి చేస్తారు. ప్రతినాయక పాత్రల్లో ఎక్కువగా కనిపించే శత్రుకి ఇందులో విభిన్నమైన పాత్ర దొరికింది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సంగీతం చిత్రానికి ప్రధానబలం. హీషమ్‌ పాటలు ఎంత బాగున్నాయో, చిత్రీకరణ కూడా అంతే బాగుంది.