ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసేందుకు టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టు తరువాత గురువారం లోకేష్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అరెస్టు అంశంపై అమిత్‌షాను కలిసేందుకు శుక్రవారం ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. టిడిపి రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర ద్వారా అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలిసింది. ఈ అంశంపైనే ఆ పార్టీ ఎంపిలతో సమావేశమైనట్లు సమాచారం. టిడిపి అధినేత అరెస్టు తీరును, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాలని లోకేష్ ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అదేవిధంగా కొంతమంది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను లోకేష్ శుక్రవారం కలిశారు. అనంతరం చంద్రబాబు అరెస్టు తీరును కొన్ని జాతీయ మీడియాలకు వివరించారు. ఈ నెల 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎంపిలతో తొలిసారి పార్లమెంటరీ సమావేశాన్ని లోకేష్ నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్టు తీరు, ఇతర అంశాలపై ఎంపిలకు దిశానిర్దేశం చేయనున్నారు.
- అరెస్టు అన్యాయం : లోకేష్
జగన్ ప్రభుత్వం చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిందని లోకేష్ అన్నారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఎలాంటి కుంభకోణం జరగలేదని జాతీయ మీడియాతోపాటు కొన్ని ప్రాంతీయ మీడియాలకు లోకేష్ వివరించారు. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారని అన్నారు. చంద్రబాబుకు డబ్బు అందిందని నిరూపించలేకపోయారని తెలిపారు. ఎలాంటి కుంభకోణం జరగలేదని తాను నిరూపించగలనని సవాల్ విసిరారు. తమకు డబ్బు అందినట్టు, తమ ఖాతాల్లోకి నగదు బదిలీ అయినట్టు సిఐడి నిరూపించగలదా? అని ప్రశ్నించారు. న్యాయం కొద్దిగా ఆలస్యం కావొచ్చని, చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకొస్తారని ధీమా వ్యక్తం చేశారు.










