Sep 10,2023 07:36

జీవితం అనే కడలిలో ఆటుపోట్లు సహజం. కష్టాలొచ్చినప్పుడు కుంగిపోకుండా.. కాస్త ఆలోచించి అడుగేయాలి. ఆ కాస్త ఓర్పు లేక అనేక జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. అలాంటివారికి చేయూతనిచ్చి ఈ ఆత్మహత్యలను నివారిద్దామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ప్రకటించింది. డబ్ల్యుహెచ్‌ఓ, ఆత్మహత్యల నివారణా సంస్థతో కలసి ఈ ఏడాది 'క్రియేటింగ్‌ హోప్‌ త్రూ యాక్షన్‌' (చేతల ద్వారా ఆశలు నింపాలి) అనే నినాదంతో సామాజిక చైతన్యం కలిగించాలని పిలుపునిచ్చింది. ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కానేకాదు. ఏదైనా బతికి సాధించాలి అని చెబుతూ నేడు 'ప్రపంచ ఆత్మహత్యల నివారణా దినోత్సవం' సందర్భంగా ఈ కథనం. మనిషి ఎంతో మానసిక హింసను అనుభవిస్తేనేగానీ ఆత్మహత్యకు పూనుకోడు. సమాజంలో సున్నితత్వం పెరిగిపోయింది. ఏ చిన్న సమస్యనూ తట్టుకోలేని పరిస్థితులు చూస్తున్నాం. తల్లిదండ్రులో, ఉపాధ్యాయులో మందలించడం, కొట్టడం లాంటి చర్యల వల్ల.. ఉద్యోగం రాలేదని, ప్రేమ విఫలమైందని, పెద్దలు ప్రేమపెళ్లికి అంగీకరించలేదని, అప్పుల బాధలతో, కుటుంబ సమస్యలతో, భర్త వేధింపులు తాళలేక, వ్యాపారంలో నష్టం వచ్చిందని, వ్యవసాయంలో గిట్టుబాటు లేదని ఇలా అనేక కారణాలతో.. ఆత్మహత్యలే పరిష్కారమని, కొందరు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. వారికి తట్టుకోలేని పరిస్థితుల్లో నేనున్నానంటూ భుజంతట్టే ఒక ఆలంబన అవసరం. అప్పుడు వారు ఆ ఆలోచనల నుండి బయటపడతారని నిపుణులు చెబుతున్నారు.
 

                                                                          విద్యార్థులు.. యువత..

ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పిల్లలకు విద్యావిధాన కొత్తపోకడలు.. సిలబస్‌లు.. పరీక్షలు.. ఇవన్నీ భరించలేని ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఆ ఒత్తిడిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కొట్టడం, తిట్టడం లాంటి తొందరపాటు చర్యలు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. దాంతో వారు మానసికంగా కుంగిపోతారు. అవమానంగా భావించి, ఆత్మహత్యలకు పాల్పడతారు. పక్కింటి, బంధువుల పిల్లలతో పోల్చి.. 'వారిలా ఎందుకు చదవవు? నీకేం తక్కువ..?' లాంటి పదేపదే ఒత్తిడి కలిగించే మాటలు ఆ పసిమనసులకు ఈటెల్లా తగులుతాయి. ఈ బంధనాల నుంచి బయటపడటానికి ఆ పసిమనసులు ఎన్నుకుంటున్న మార్గం ఆత్మహత్య. ఇంతకంటే హృదయవిదారకమైన విషయం మరోటిలేదు.
          దేశ భవిష్యత్తును తమ భుజాలపై మోయాల్సిన యువత నిర్వీర్యమైతే దేశానికే నష్టం. ప్రేమ విఫలమైందనీ, స్నేహితులతో తనకూ ఉద్యోగం రాలేదని, మత్తు పదార్థాలకు అలవాటుపడి.. ఇలా అనేక కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
 

                                                                      తల్లిదండ్రుల పాత్ర..

చాలామంది తల్లిదండ్రులు పిల్లల మనసెరిగి మసలుకోవటం లేదని ఓ అధ్యయనంలో తేలింది. పిల్లల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తమకు నచ్చిందే చేయాలనడం సరైనది కాదు. ఒకవేళ వారు తీసుకున్న నిర్ణయం సరిగా లేనప్పుడు వారికర్థమయ్యేలా చెప్పాలి. ఏ విషయాన్నైనా పిల్లలకు ఎంత సున్నితంగా, ప్రేమగా చెబితే అంత మంచిది.
 

                                                                                   ప్రేమ..

యుక్తవయసు రాగానే, తల్లిదండ్రుల నుంచి ప్రేమాభిమానాలు అందనప్పుడు వారు ఇతర మార్గాల్లో వాటిని వెతుక్కుంటారు. దీనికి తోడు మీడియా ఆకర్షణలు, విపరీతాలు.. వారి మనసులను కలుషితం చేస్తున్నాయి. వీటి ప్రభావంతో చదువు, లక్ష్యంపై దృష్టి పెట్టడంమాని, రకరకాల ప్రలోభాల బారిన పడుతున్నారు. ప్రేమకు నిర్వచనం తెలీక ఆకర్షణే ప్రేమ అని భ్రమించి, అవతలి వారి ఆలోచనలతో ప్రమేయం లేకుండా తమను అంగీకరించలేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
 

                                                                              మత్తు పదార్థాలతో..

ఇంటి దగ్గర అనుకూల వాతావరణం, సరైన పేరెంటింగ్‌ లేని పిల్లలు అనేక దురలవాట్లకు లోనవుతున్నారు. మార్కెట్‌లో విచ్చలవిడిగా చెలరేగుతున్న మద్యం, డ్రగ్స్‌లాంటి మత్తు పదార్థాలు.. యువత శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. వీటికి అలవాటుపడిన వారు క్రమ క్రమంగా నిస్సత్తువ, నిస్సహాయత, నిరాదరణకు లోనవుతున్నారు. జీవితం మీద విరక్తి చెంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చివరకు ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
 

                                                                                     కుటుంబంలో..

వైవాహిక జీవితంలో ఇద్దరిమధ్యా సరైన అవగాహన, సరిపెట్టుకునే మనస్తత్వాలు లేకపోవడం,ఆర్థిక ఇబ్బందులు, ప్రణాళిక లేని ఖర్చులు ఇరువురి మధ్యా విభేదాలకు దారితీస్తున్నాయి. పరిష్కారం దిశగా ఆలోచించాల్సింది పోయి క్షణికావేశంతో ఆత్మహత్యే మార్గం అనుకుంటున్నారు.
 

                                                                             రైతుల ఆత్మహత్యలు..

పదిమందికీ పట్టెడన్నం పెట్టేది రైతు. ఆ రైతు పరిస్థితే ఎంతో దయనీయంగా మారింది. వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి. రైతులు సుస్థిరమైన వ్యవసాయ విధానాలు అనుసరించేందుకు అనుకూల పరిస్థితులు లేవు. సకాలంలో వర్షాలు లేక బోర్లపై ఆధారపడాల్సి వస్తోంది. అక్కడా విద్యుత్‌ కష్టాలు అనేకం. సరఫరా, ఛార్జీల బాదేస్తున్నాయి. అష్టకష్టాలుపడి పండిస్తే, గిట్టుబాటు ధరలుండవు. చిన్న కమతాలు, కౌలు రైతులకు కష్టపడటమే కానీ, కౌలు కూడా కట్టలేని పరిస్థితి. పండించిన దాన్ని దళారులు కబ్జా చేయడమేగానీ, స్వతంత్రంగా అమ్ముకునే అవకాశం లేదు. ఎగుమతి-దిగుమతి విధానాలు రైతులకు అనుకూలంగా లేవు. బీమా, మార్కెటింగ్‌, నిల్వ సదుపాయాలలో పారదర్శకత లేదు. ఇవన్నీ భరించలేని రైతు ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నారు.
 

                                                                               చిన్నవ్యాపారస్తులు..

నోట్లరద్దు, జీఎస్‌టీ అమల్లోకి వచ్చి, ఈ రంగం మరింత క్షీణించింది. చిరు వ్యాపారస్తుల ఆత్మహత్యలు పెరిగాయి. 2019లో అది 13 శాతానికి పెరిగిందని ప్రింట్‌ నివేదిక తెలిపింది. దానికి తోడు కోవిడ్‌ వల్ల ఆన్‌లైన్‌లోనే వస్తువులను తెప్పించుకోవడంతో చిన్న వ్యాపారాలు కుంటుపడ్డాయి. కుటుంబపోషణ కష్టమైంది. దీంతో అనేకమంది నిరాశా, నిస్పృహలకు లోనై ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
 

                                                                                సర్వే నివేదిక..

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2021లో ఆత్మహత్యలపై జాతీయ స్థాయి సర్వే నిర్వహించింది. ప్రతి మూడు సెకన్లకూ ఒకరు ఆత్మహత్యాయత్నం, ప్రతి నలభై సెకన్లకు ఒక ఆత్మహత్య జరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. దక్షిణ భారతదేశంలోనే బలవన్మరణాలు ఎక్కువని ఆ నివేదిక పేర్కొంది.

                                                                             ఆసరాగా.. ఆస్రా

           రాజస్థాన్‌లోని కోటా నగరం ఇంజనీరింగ్‌, మెడికల్‌ కోచింగ్‌ సెంటర్లకు ప్రసిద్ధి. ఒత్తిడి కారణంగా ఆయా సెంటర్లలో ఒక్క ఆగస్టు నెలలోనే ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంవత్సరంలో మొత్తం 23 మంది స్టూడెంట్స్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు సర్వే నివేదిక. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ రెండు నెలల పాటు కోచింగ్‌ సెంటర్‌లలో పరీక్షలను నిలిపివేయాలని ఆదేశించింది. 'స్టూడెంట్‌ సెల్‌'ను ఒకదానిని ఏర్పాటు చేసి హాస్టల్స్‌, మెస్‌లు, కోచింగ్‌ సెంటర్‌లు, విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రదేశాల దగ్గర హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు.
ఆ నంబర్లకు ఫోన్‌ చేస్తే మానసిక వైద్యులు వారికి కౌన్సెలింగ్‌ ఇస్తారు.
కిరణ్‌:1800-599-0019, ఆస్రా: 9820466726 నంబర్లు 24/7 పనిచేస్తాయని వారు తెలిపారు.

        అయితే జిల్లా హాస్టల్‌ అసోసియేషన్‌ వాళ్లు ఆత్మహత్యల నివారణకు స్ప్రింగ్‌ లోడెడ్‌ ఫ్యాన్‌లు ఏర్పాటు చేసినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏదో ఒకవిధంగా చనిపోయే మార్గాలను ఎంచుకుంటారు. అసలు ఆ ఆలోచనే రాకుండా చేయాలని మానసిక నిపుణుల అభిప్రాయం .

                                                    టి.టాన్యా
                                                7095858888

Lets-be-assured-Lets-survive

                                                                          అప్రమత్తత అత్యవసరం..!

ఎవరికైతే అకస్మాత్తుగా ఆహారం-ఆహార్యంలో మార్పు రావడం.. అందరూ తనను మోసం చేస్తున్నారని, తానింక బతకటం వేస్ట్‌ అని, పదేపదే ఆత్మహత్య గురించి మాట్లాడటం.. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండాలనుకోవడం.. అప్పగింతలు చెప్పడం.. ప్రతి చిన్న విషయానికీ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేయడం.. తమకు తామే హాని చేసుకోవడానికి ప్రయత్నించడం.. తరచూ జరిగిన వాటిని గుర్తు తెచ్చుకుని, ఏడవడం లాంటి లక్షణాలనుబట్టి వారి మానసిక పరిస్థితిని గుర్తించవచ్చు. అంతేకాక కుటుంబంలో ఎవరైనా మానసిక రుగ్మతలున్న వారు, డిప్రెషన్‌కు లోనైనవారు, ఆత్మహత్యకు పాల్పడిన వారున్నా ఇలాంటి ఆలోచనలకు దారితీసే అవకాశం ఉందంటారు ప్రముఖ మానసికారోగ్య నిపుణులు
డా. నవీన్‌.
 

                                                                                  నివారణ..

పిల్లల విషయంలో తల్లిదండ్రుల పాత్రే ముఖ్యం. వారితో వీలైనంత సమయం గడపాలి. పిల్లలు ఏ విషయమైనా, ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా చెప్పుకోగలిగే వాతావరణం అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇటీవల కొంత కాలంగా ఇంటర్‌ విద్యార్థులు కళాశాలల్లో ఒత్తిడి వాతావరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే కళాశాలల్లో తప్పనిసరిగా మానసిక నిపుణుల పర్యవేక్షణ అవసరం.
 

                                                                   పెద్దల్లో నివారణోపాయాలు..

  • వారి మానసిక పరిస్థితిని గుర్తించిన వెంటనే మానసిక వైద్యులను సంప్రదించాలి.
  • అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేస్తే వెంటనే కౌన్సెలింగ్‌ ఇచ్చి, ప్రాణాలు కాపాడతారు.
  • డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తుల్లో ఆత్మహత్యల గురించిన ఆలోచనలు గమనిస్తే సివియర్‌ డిప్రెషన్‌ కింద భావించి, చికిత్స ప్రారంభిస్తారు.
  • ఒంటరిగా ఉండటం, ప్రమాదకర వస్తువులు దగ్గర ఉంచుకోవడానికి అవకాశమే ఇవ్వకూడదు. వారి కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
  • అగౌరవంగా, కించపరిచి నట్లు మాట్లాడటం, ఎవరితో నైనా పోల్చడం, కొట్టడం లాంటివి చేయకూడదు.
  • వారు చెప్పేది సానుభూతితో వినాలి. వీలైనంత వరకు నా చుట్టూ అందరూ ఉన్నారనే భరోసా ఇవ్వాలి. డా. సూరపనేని నవీన్‌,

11

డా. నవీన్‌. సైకియాట్రిస్ట్‌
మనశ్శాంతి హాస్పిటల్‌
ఫోన్‌ : (0866) 2432368.