- రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి
- రైతులందరూ ఐక్యమత్యంతో ఉద్యమించాలి
ప్రజాశక్తి-దేవనకొండ (కర్నూలు) : ప్రతి ఎకరాకు హంద్రీ నీవా కాలువల ద్వారా సాగునీరు అందే వరకు పోరాడుదామని అందుకుగాను రైతులందరూ ఐక్యంగా సంఘటితమై ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గుండ్లకొండ హంద్రీనీవా కాలువ దగ్గర స్లూయిజ్ ఏర్పాటుచేసి పి కోటకొండ, మాచాపురం గ్రామాల వరకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర సోమవారం గుండ్లకొండ నుండి నేలతలమర్రి మీదుగా దేవనకొండకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రైతు సంఘం మండల కార్యదర్శి సూరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు జూన్ నెల ప్రారంభంలో కురిసిన అరకొర వర్షాలకు పంటలు సాగు చేయగా వర్షాభావ పరిస్థితుల వల్ల మొక్కలు గిడసభారి ఎదుగుదల లేక తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు నష్టపోయారన్నారు. ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు రూ 40 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలు వలసలు వెళ్లకుండా ఉపాధి పథకం కింద అదనంగా వందరోజుల పని కల్పించాలన్నారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోవడం లేదన్నారు. రైతుల అభివద్ధికి ఎలాంటి చర్యలు గైకొనడం లేదని ఆరోపించారు. గత నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వం హంద్రీనీవా కాల్వ మరమ్మతులకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. పంట కాలువల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో మండలంలో 46000 ఎకరాలకు సాగునీరు అందడం లేదన్నారు. రాజస్థాన్ తార్ ఎడారి ప్రాంతంలో ఏ విధంగా వర్షాభావ పరిస్థితుల ఉంటాయో అదేవిధంగా అనంతపూర్, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో అలాంటి కరువు పరిస్థితులు ఉంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ, వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీర శేఖర్ మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి ఆలంబిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికలప్పుడు రైతుల అభివద్ధికి ఎంతో చేస్తామని హామీలు ఇచ్చిన నియోజవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం ఎలాంటి అభివద్ధి చేయలేదన్నారు. పి. కోటకొండ గ్రామ బస్ స్టేషన్ నుండి బేతపల్లి గ్రామం వరకు రహదారి కంకర రాళ్లు తేలి అద్వాన స్థితికి చేరుకుందన్నారు. ఆ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన పాలక ప్రజా ప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆ గ్రామానికి వెళ్లే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మండలంలో ప్రతి గ్రామానికి హంద్రీనీవా కాలువల ద్వారా నీటిని అందించే వరకు పార్టీలకతీతంగా రైతులందరూ ఉద్యమించాలని అందుకు రైతు సంఘం పూర్తి మద్దతు తెలిపి పోరాడుతామని తెలిపారు. అనంతరం స్థానిక తాసిల్దార్ వెంకటేష్ నాయక్ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో చెల్లెల చెలిమల, గుడిమిరాళ్ల సర్పంచులు చిన్న రామప్ప, శేషి రెడ్డి, ఉప సర్పంచ్ కౌలుట్ల, రైతు సంఘం, ప్రజా సంఘాల నాయకులు అశోక్, యూసుఫ్ భాష, ఓంకార్, శ్రీనివాసులు, బజారి, మహబూబ్ బాషా, శ్రీరాములు, నాగేష్ ,నాగేంద్ర ,నాగరాజు, రాయుడు, రంగన్న, సుంకన్న, వీరేంద్ర కౌట్లయ్య స్వామి వివిధ గ్రామాల రైతులు కృష్ణ, వెంకట రాముడు, హనుమన్న కౌలుట్ల, ప్రహల్లాద, శీను, జయ చంద్ర తో పాటుగా కోటకొండ బేతపల్లి చలమ చెలిమిల,గుండ్లకొండ, గుడిమరాళ్ళ, నేలతలమారి కోటకొండ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పోలీసుల ఆంక్షలతో సాగిన పాదయాత్ర
రాష్ట్రంలో144 సెక్షన్ అమల్లో ఉన్న తరుణంలో దేవనకొండ మండలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర పోలీసుల ఆంక్షలతో ముందుకు సాగింది. గుండ్లకొండ నుండి నెలతలమర్రి మధ్యలో పాదయాత్రను ఆపాలని ఎస్సై భూపాలుడు ప్రయత్నం చేసినప్పటికీ రైతుల కోసం, ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నామని రాజ కీయ పార్టీల కోసం తాము పోరాడడం లేదని రైతు సంఘం నాయకులు తేల్చి చెప్పారు. దీంతో పాదయాత్ర యధావిధిగా కొనసాగుతూ విజయవంతంగా ముగిసింది.










