తెలంగాణ : తెలంగాణ శాసనసభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫారం-1 నోటీసును ఎన్నికల అధికారులు జారీ చేయనున్నారు. ఆ తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల పదో తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాన్ని ప్రారంభించాయి. ప్రధాన పార్టీల టికెట్ ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
నామినేషన్ల ప్రక్రియలో కొత్త నిబంధన..
నామినేషన్ల ప్రక్రియలో ... ఈసారి అభ్యర్థులు వారి నేరాల చిట్టాను స్పష్టంగా పేర్కొనాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కొత్త నిబంధన తెచ్చింది. ఆ నేరాల వివరాలను మూడు దఫాలు వార్తా పత్రికల్లో యథాతథంగా ప్రచురించాలని తెలిపింది. ఒకవేళ అభ్యర్థి జైలులో ఉంటే అక్కడి అధికారుల ఎదుట ప్రమాణం చేసి, వారి ధ్రువీకరణతో పత్రాలు పంపాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 94 రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 2,644 నామినేషన్లు దాఖలయ్యాయి.










