Jul 17,2023 21:25

ముంబయి: ఐర్లాండ్‌కు వెళ్లే భారతజట్టు కోచ్‌గా వివిఎస్‌ లక్ష్మణ్‌ వ్యవహరించనున్నాడు. వెస్టిండీస్‌ పర్యటన తర్వాత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడమే ఇందుకు కారణం. ద్రావిడ్‌తోపాటు సహాయక సిబ్బంది కూడా విశ్రాంతి తీసుకోనున్నారు. దాంతో, ఐర్లాండ్‌ సిరీస్‌లో భారత జట్టు ద్రవిడ్‌ లేకుండానే బరిలోకి దిగనుంది. అతడి గైర్హాజరీలో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ హెడ్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ ఈ సిరీస్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. వెస్టిండీస్‌ టూర్‌ ముగిసిన తర్వాత ద్రవిడ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌, బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ హంబ్రే అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. వీళ్లు తిరిగి ఆగస్టులో భారత్‌కు రానున్నారు. ఆగస్టు 31 నుంచి జరిగే ఆసియా కప్‌ టోర్నమెంట్‌కు మళ్లీ రాహుల్‌ ద్రావిడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆసియా కప్‌ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆ తర్వాత వనే ప్రపంచకప్‌తో భారతజట్టు బిజీ షెడ్యూల్‌తో గడపనుంది. ఈ నేపథ్యంలోనే బిసిసిఐ ద్రవిడ్‌ బృందంపై పని ఒత్తిడి పడకుండా కొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వాలని అనుకున్నట్లు సమాచారం.