- ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలి ఎన్నికలు
లే హ్: కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని కార్గిల్‌లో లడఖ్ అటానమస్ హిల్ కౌన్సిల్‌కు నిర్వహించిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. 26 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి 19 స్థానాల్లో గెలుపొందాయి. ఎన్‌సి 11, కాంగ్రెస్ 8 సీట్లలో విజయం సాధించాయి. బిజెపి 2 సీట్లు, ఐఎన్‌డిపి ఒక సీటు గెలుచుకున్నాయి. 4 సీట్ల ఫలితాలు రావాల్సి ఉంది. 26 స్థానాల్లో 85 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.2019 ఆగస్ట్ 5న జమ్ముకాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్ముకాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ సందర్భంగా జమ్ముకాశ్మీర్‌లోని రాజకీయ పార్టీల నేతలను గృహ నిర్బంధం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఈ తీర్పు ఇచ్చినట్లుగా జమ్ముకాశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి. రాష్ట్ర విభజన వల్ల తాము చాలా నష్టపోయినట్టు పోలింగ్ సందర్భంగా కార్గిల్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ముకాశ్మీర్‌ను తిరిగి విలీనం చేయడంతోపాటు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.










