Sep 15,2023 21:46

న్యూఢిల్లీ : స్వాతంత్య్ర ఉద్యమ నేత, ప్రముఖ కార్మిక సంఘ నేత, సైద్ధాంతికవేత్త, సిపిఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యులు కన్నయ్య లాల్‌ బెనర్జీ శుక్రవారం తెల్లవారుజామున కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 97సంవత్సరాలు. గత కొద్ది కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యాలకు ఆయన చికిత్స తీసుకుంటున్నారు. విద్యార్థుల పరిశోధన నిమిత్తం ఆయన శరీరాన్ని మెడికల్‌ కాలేజీకి అందజేశారు. తూర్పు పాకిస్తాన్‌లోని ఢాకా రాణి మండల్‌లోని బిక్రమ్‌పూర్‌లో 1926 అక్టోబరు 10న జన్మించిన ఆయనను కన్నయ్య దా అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. దేశ విభజన తర్వాత భారత్‌కు ఆయన కుటుంబం వచ్చేసింది.

  • సిపిఎం పొలిట్‌బ్యూరో సంతాపం

విద్యార్థిగా ఉన్నపుడే స్వాతంత్య్ర ఉద్యమంలో చేరిన కన్నయ్య ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. రైల్వే ఉద్యోగిగా చేసిన ఆయన తన జీవితాంతం రైల్వేలో కార్మిక ఉద్యమం అభివృద్ధికి కృషి చేశారు. సిఐటియు కేంద్ర ఆఫీసు బేరర్‌గా పనిచేసిన ఆయన కార్మిక ఉద్యమం అభివృద్దికి కీలకమైన సేవలందించారంటూ ఆయన మృతికి సిపిఎం పొలిట్‌బ్యూరో సంతాపం వ్యక్తం చేసింది. తత్వశాస్త్రం, సంస్కృతి గురించి చాలా ఆసక్తి కలిగిన ఆయన వాటిలో ప్రావీణ్యతను సంపాదించారు. కన్నయ్య చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఆయన కుటుంబ సభ్యులందరికీ సానుభూతిని తెలియజేసింది. పార్టీ కార్యకర్తల పట్ల చాలా ప్రేమగా వుండే ఆయన రాజకీయ సైద్ధాంతిక పోరులో అసలు రాజీ పడేవారు కాదు. సైద్ధాంతిక పోరు సాగుతున్న ఈ క్లిష్ట సమయంలో ఆయన మృతి పార్టీకి తీరని నష్టమని పొలిట్‌బ్యూరో పేర్కొంది. బాగా పుస్తకాలు చదివే ఆయన సృజనాత్మర రచనలు కూడా చేశారు. మార్క్సిజం - లెనినిజం పై విశ్లేషణాత్మక సామర్ధ్యాన్ని కలిగివుండేవారని పొలిట్‌బ్యూరో గుర్తు చేసుకుంది. 2008 వరకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా సేవలందించారు.