Sep 29,2023 10:11

న్యూఢిల్లీ : గణేష్‌ మండపం నుంచి ప్రసాదం తీసుకున్నాడనే కారణంతో ఈశాన్య ఢిల్లీలోని సుందర్‌నగరిలో మానసిక వికలాంగుడైన ముస్లిం యువకుడ్ని దారుణంగా హత్య చేశారు. 26 ఏళ్ల ఇసార్‌ను ఒక విద్యుత్‌ స్థంభానికి కట్టివేసిన కొంత మంది దుండగులు కర్రలతో తీవ్రంగా కొట్టారు. తీవ్రగాయాలతో ఇసార్‌ మరణించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక బాలుడితో సహా ఏడుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఈ దారుణ ఘటనను సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ విద్వేషపూరిత నేరానికి పాల్పడిన వారందరిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సంజరు అరోరాకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె ఎం తివారీ లేఖ రాశారు. ఈ ప్రాంతంలో మత విద్వేషాలను వ్యాప్తి చేయడంలో కొన్ని తీవ్రవాదు గ్రూపు పాత్రపైనా విచారణ చేయాలని కోరారు.