ఖమ్మం : అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఖమ్మం నగరానికి చెందిన విద్యార్థిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేసిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. యువకుడి తండ్రి రామ్మూర్తి కథనం మేరకు ... అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్ (29) ఎంఎస్ చదువుతూ పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. గత మంగళవారం జిమ్ నుంచి ఇంటికి వెళుతుండగా, ఒక దుండగుడు వచ్చి కత్తితో వరుణ్ రాజ్ కణతపై పొడిచాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని వరుణ్ రాజ్‌ను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వరుణ్‌కు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నాడని డాక్టర్లు తెలిపారు. దాడి చేసిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వరుణ్ రాజ్ తండ్రి రామ్మూర్తి మంగళవారం రాత్రి మంత్రి పువ్వాడ అజరును కలిసి తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని కోరారు.










