Nov 08,2023 11:47

ఖమ్మం : అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం విద్యార్థి వరుణ్‌రాజ్‌ (29) మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో వరుణ్‌ ఇంటివద్ద విషాదఛాయలు అలముకున్నాయి. ఖమ్మంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన వరుణ్‌ రాజ్‌ సంవత్సరన్నర క్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. అక్టోబర్‌ 31న జిమ్‌ నుంచి ఇంటికి వెళుతుండగా ఓ దుండగుడు కత్తితో వరుణ్‌ రాజ్‌పై దాడి చేసి కణతపై పొడిచాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న వరుణ్‌కు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు బుధవారం సమాచారం అందింది.