కాల్చడంలోని కరకు తనాన్ని
పరిచయం చేసుకున్న వాళ్లు
వెలిగించడంలోని వెలుగుదనాన్ని
వెలికి తీస్తే బాగుణ్ణు కదా....
రాజకీయం
ఒక వెన్నెల దోచిన సైక్లోన్.
చూపుడువేలుపై చుక్క పడీపడంగానే
వినయాలు
గాండ్రింపుల మలుపు తిరుగుతారు.
ఇవేమీ ఊసుపోక రాసిన రాతలు కావు
చివుక్కున గుచ్చుకొని ఉలిక్కిపడేలా చేసే..
కలం మేఘాలు వర్షించే అక్షర చినుకులివి.
మగతలో ఉన్న జనాన్ని
అక్షర సజలాలు చల్లి లేపే తెగువ
కవి కార్యాచరణ ప్రణాళిక అయినప్పుడు...
భవిష్యత్తుని కాంతిమయం చేయుటకై
దివిటీలు ఉదయిస్తాయి.
రెమ్మ చాటున దాగిన పిందెలన్నీ
పరిపక్వమై ప్రతిఫలిస్తాయి.
అవ్వారు శ్రీధర్ బాబు
85001 30770










