Nov 05,2023 17:01

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్లు ఇరిగేషన్‌ పై ఖర్చుపెట్టిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కాంట్రాక్టర్ల ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్ట్‌ అయ్యిందన్నారు. ఈ ప్రాజెక్టులో 25 వేల కోట్లు గల్లంతయ్యాయి, మూడు బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పనికిరాకుండా పోయాయన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్‌ కట్టినప్పుడు గ్రామస్తుల దగ్గర తక్కువ డబ్బులకే భూములు గుంజుకున్నారు, వారికి న్యాయం జరగకుండానే రాత్రిపూట కొట్టి బుల్డోజర్లతో కూల్చి గ్రామాన్ని ఖాళీ చేయించారు అయిన ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదన్నారు.కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే చిప్ప చేతికి వస్తది, తెలంగాణ ను సరి చేసుకోవలసిన అవసరం ఏర్పడింది, కాబట్టి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ను గెలిపించుకోవాలన్నారు. ప్రజాస్వామిక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడాలని కాంగ్రెస్‌ కు జేఏసీ పక్షాన కొన్ని డిమాండ్లతో సంపూర్ణ మద్దతు తెలిపామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్‌ ఎలా కొట్టుకపోతుందో ఈ ప్రభుత్వం కూడా అలాగే కొట్టుకుపోతుందన్నారు. హుస్నాబాద్‌ నుండి ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్‌ ను గెలిపించుకోవాలన్నారు.