హైదరాబాద్: కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలయిందని, కేసీఆర్ కుటుంబం ఆర్థిక ఉగ్రవాద కుటుంబం అని రేవంత్ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందన్నారు. కాళేశ్వరంపై జాతీయ స్థాయిలో ఒక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలన్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని కోరారు. మేడిగడ్డ బ్యారేజ్‌కు జరిగిన డ్యామేజ్ పై చర్యలు తీసుకోవాలన్నారు.కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారన్నారు.కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆలోచనలు మారి ఆశలు పెరిగాయన్నారు.'మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల ప్లానింగ్ వేరు,నిర్మాణం వేరుకావడం వల్లే మునిగిపోతున్నాయి.కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ కుంగింది. కాళేశ్వరం కోసం తన మెదడును ఖర్చు చేశానని చెప్పిన కేసీఆర్ లోపాలు బయట పడగానే తప్పించుకుంటున్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు. ఎల్ అండ్ టీ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారు. కమిషన్లు నొక్కేయడానికే కేసీఆర్ ప్రణాళిక బద్దంగా ప్లాన్ వేశారు'అని రేవంత్ విమర్శించారు.










