కోరుకున్నట్టు కలలు కనొచ్చా.. అంటే మన కలకు మనమే దర్శకత్వం వహించవచ్చా..! అదెలా? మీరు నిద్రపోతూ కలలో ఉన్నప్పుడు కూడా కలలో ఉన్నామని మీకు తెలియడమే లూసిడ్ డ్రీమింగ్ అంటే. కోరుకున్న కలలు కనడం గురించి టీనేజ్‌లో ఉండి, మొదటిసారి విన్నప్పుడు వెంటనే ఆకర్షితులమైపోతాం. అదెలాగంటే.. ఎప్పుడైనా గాల్లో ఎగరాలనుకున్నారా? గోడలపై నడవాలనుకున్నారా? ప్రముఖ వ్యక్తిని కలవాలనుకున్నారా? ఎడ్వంచర్స్ చూసి అబ్బ! నేనూ అలా చేస్తే.. అనుకున్నారా! అలా అనుకునే మీలాంటి వారి కోరికలన్నీ ఈ లూసిడ్ డ్రీమ్‌తో సాధ్యమవుతాయి. కలలో ఉన్నప్పుడు కూడా స్పహతో ఉండి, ఆ కల ఎలా ఉండాలనుకుంటున్నామో సరిగ్గా అలాంటి అనుభూతిని కలిగిస్తుంది. మీకు నచ్చినట్టుగా నియంత్రించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
సాధారణంగా నిద్రపోయిన తర్వాత కలలు వచ్చే దశను ఆర్‌ఈఎం (ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్) గా వ్యవహరిస్తారు. ప్రయోగాత్మకంగా ల్యాబ్‌లో పరిశోధించినప్పడు.. ఆర్‌ఈఎం వంటి నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ కళ్లతో సంకేతాలు ఇవ్వగలిగితే 'వారు లూసిడ్ డ్రీమింగ్‌లో ఉన్నట్టు భావిస్తాం' అని ఇలినాయిస్‌లోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ రీసెర్చర్ కరెన్ కాన్‌కోలి చెప్పారు.

- కారణం..
స్వీయ అవగాహన, విమర్శనాత్మక ఆలోచనకు మూలమైన ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లో కొంత భాగం ర్యాండమ్ ఐ మూవ్‌మెంట్ సమయంలో కాస్త నిస్తేజంగా ఉండటమే దీనికి కారణం. లూసిడ్ డ్రీమింగ్‌లో ఉన్నప్పుడు మెదడులోని ముందు భాగాలు కొంత ఎక్కువ చురుగ్గా ఉంటాయని ఓ అధ్యయనం చెబు తోంది. కొందరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే కోరుకున్న కలలు (లూసిడ్ డ్రీమింగ్) కంటారు. దానికి కారణం ఏదైనా సాధించాలనే తపన, బయటి విషయాల ప్రభావం, సంభాషణ, వీడియో, ఏదైనా ప్రత్యేక కథనం కావచ్చు.
'లూసిడ్ డ్రీమ్స్ చాలావరకు కౌమారదశలో ప్రారంభమవుతాయి. అవి సహజంగా, అప్రయత్నంగా వచ్చే కలలు, పీడకలలు కూడా అవ్వవచ్చని' లిథువేనియాలోని విల్నియస్ యూనివర్సిటీ సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ టాడస్ స్టంబ్రిస్ చెప్పారు. నేర్చుకున్నవారిలో వచ్చే లూసిడ్ డ్రీమ్స్ కంటే, సహజంగా వచ్చే లూసిడ్ డ్రీమ్స్ ఎక్కువసేపు ఉంటాయంటారు ఆయన.
- సాధ్యమేనా..
లూసిడ్ డ్రీమ్స్ కోరుకునేవారు కొన్ని టెక్నిక్స్‌ని ఫాలో అయ్యి, సాధ్యం చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సామర్థ్యం మెరుగు పరచుకోవడం, గాల్లో ఎగరడం, ఇష్టమైనవారితో ఉన్నట్లుండడం.. వంటి ఫాంటసీలలో గడపడమే లూసిడ్ డ్రీమింగ్‌కు ప్రేరణ అని అధ్యయనాల్లో తేలింది.

- మంచిదేనా..!
పీడకలల నుంచి బయటపడేందుకు, సమస్యల పరిష్కారం కోసం, సజనాత్మక ఆలోచనలు, నైపుణ్యాలను పెంచుకునేందుకు లూసిడ్ డ్రీమింగ్‌ను ఉపయోగిస్తున్నారని, అలా డ్రీమ్స్‌లోకి వెళ్లిన వారి సామర్థ్యంలో గణనీయమైన మార్పులు కనిపించినట్లు అధ్యయనంలో తేలింది. క్లినికల్ డిప్రెషన్, పీటీఎస్‌డీ (పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్) లాంటి తీవ్రమైన మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు లూసిడ్ డ్రీమింగ్ ఉపయోగపడుతుందని ఆ అధ్యయనం సూచించింది.
'షిజోఫ్రీనియా లాంటి మానసిక సమస్యలు ఉన్నవారు, లూసిడ్ డ్రీమ్స్ టెక్నిక్స్ పాటించడం అంత మంచిది కాదు' అని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్, సైకాలజీ విభాగంలో విజిటింగ్ రీసెర్చర్ అయిన డెనోమ్ యాస్పి గుర్తించారు.
- ఎలా..!
లూసిడ్ డ్రీమ్స్ ప్రేరేపించేందుకు ఐదు విధానాలను ప్రతిపాదించారు. వాటిలో మైల్డ్ (ఎంఐఎల్‌డీ - నిమోనిక్ ఇండక్షన్ ఆఫ్ లూసిడ్ డ్రీమ్స్) టెక్నిక్ అత్యంత ప్రభావమైనదిగా యాస్పి గుర్తించారు. సుమారు ఐదు గంటల పాటు నిద్రించిన తర్వాత 'నేను మళ్లీ కల కంటున్నాను. నేను కల కంటున్నట్టు నాకు తెలుసు' అని అనుకుంటూ నిద్రలోకి వెళ్లిపోయి, లూసిడ్ డ్రీమ్స్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడమే మైల్డ్ విధానం. ఈ టెక్నిక్ ప్రకారం ఐదు నుంచి పది నిమిషాల్లో నిద్రలోకి వెళ్లిపోయి, మంచి కలలు వస్తే అత్యధిక సక్సెస్ రేటు సాధించినట్లు భావించాల్సి ఉంటుందని యాస్పి చెప్పినట్లు.. అంతర్జాతీయ అధ్యయనం ఒకటి 2020లో ప్రచురితమైంది.

- లూసిడ్ డ్రీమ్ పరికరాలు..
'క్రమంగా లూసిడ్ డ్రీమ్స్‌ను ప్రేరేపించే పరికరాలు మార్కెట్‌లో ఇప్పటివరకూ నిరూపితం కాలేదు. ఆర్‌ఈఎం స్లీప్‌లో ఉన్నప్పుడు వేలిపై లైట్లు వెలగడం, వైబ్రేషన్ రావడం, శబ్దాలు చేసే రెండు రకాల తాత్కాలిక పరికరాలు ఉన్నాయ'ని ష్రెడిల్ చెప్పారు. నేరుగా మెదడుని ప్రభావితం చేసే పరికరాల తయారీకి కషి జరుగుతోంది. అయితే ఇవి చాలా ప్రమాదకరం. ఒకవేళ వాటిని అభివద్ధి చేసినా, ఇంట్లో ఎట్టి పరిస్థితిలోనూ ఉపయోగించకూడదని ష్రెడిల్ చెప్పారు.
ఏది ఏమైనా మనిషి మేథాశక్తి అమోఘమైనది, అద్భుతమైనది. అనేకానేక పరిశోధనలూ, ప్రయోగాలూ జరిగితేనే టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. ప్రకృతికి, పర్యావరణానికి, ముఖ్యంగా మానవాళికి ముప్పు లేనంతవరకూ టెక్నాలజీ అభివృద్ధి చెందాలి. తద్వారా తాత్కాలిక ఇబ్బందులు ఎదురైనా మనం స్వీకరించాల్సిందే. అయితే మనకు మనం ప్రశ్నార్థకం కానంతవరకే సుముఖత చూపిస్తుంది.










