Aug 30,2023 09:50
  • గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్ట్‌ కూడా కట్టబెట్టే అవకాశం !

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : కాకినాడ సెజ్‌ను ప్రభుత్వం కార్పొరేటర్‌ సంస్థలకు అప్పగిస్తూ వస్తోంది. తొలుత జిఎంఆర్‌కు, తర్వాత అరబిందోకి ఈ భూములను అప్పగించారు. తాజాగా సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జెఎస్‌డబ్ల్యు చేతిలో పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. పరిశ్రమలు వస్తాయని, అభివృద్ధి జరుగుతుందని, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎదురుచూస్తున్న భూ నిర్వాసితులకు ఏళ్ల తరబడి నిరాశే మిగులుతోంది. సుదీర్ఘకాలంగా సెజ్‌ భూములు నిరుపయోగంగా పడి ఉండడంతో అటు వ్యవసాయ ఉత్పత్తులు నష్టపోయి, ఇటు పారిశ్రామిక అవసరానికి కూడా భూములు అక్కరకు రాని పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సెజ్‌ భూములు రెండుసార్లు చేతులు మారింది. ఇప్పుడు మరోసారి ఈ భూములు చేతులు మారనున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే కార్పొరేట్‌ సంస్థలు సెజ్‌ భూములపై ఆసక్తి చూపుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
           కాకినాడ సెజ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థ 2003లో ఏర్పాటైంది. 2005 డిసెంబర్‌, 2006 జనవరిలో భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ పేరుతో నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాకినాడ పరిసరాల్లో ఒఎన్‌జిసి ఆధ్వర్యంలో రిఫైనరీ ఏర్పాటుతో సహా పలు ఆయిల్‌ కంపెనీలు తీసుకొస్తామని ఆ సమయంలో చెప్పుకొచ్చింది. ఈ మేరకు భూసేకరణ చేపట్టింది. యు.కొత్తపల్లి మండలంలో 2,295 ఎకరాలు, తొండంగి మండలంలో 2,398 ఎకరాలు, ప్రభుత్వ భూములు కలుపుకుంటే మొత్తం 10,500 ఎకరాల పరిధిలో కాకినాడ సెజ్‌ విస్తరించింది. ఈ భూములను జిఎంఆర్‌ సంస్థకు అప్పగించింది. 2,180 ఎకరాలకు సంబంధించిన రైతులు తమ భూములను ఇవ్వడానికి వ్యతిరేకించారు. పరిహారం కూడా తీసుకోలేదు. దీంతో, ఆ భూములను సంబంధిత రైెతులకు ప్రభుత్వం అప్పగించింది. మిగిలిన 8,320 ఎకరాల్లో పరిశ్రమలు రాకపోగా, 17 ఏళ్లుగా భూములన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ సెబ్‌లోని 51 శాతం వాటాను అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు జిఎంఆర్‌ సంస్థ రూ.2,610 కోట్లకు రెండేళ్ల క్రితం విక్రయించేసింది. ఇప్పుడు ఈ భూములను సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జెఎస్‌డబ్ల్యుకు విక్రయించేందుకు చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. ఇప్పటికే అరబిందో, సజ్జన్‌ జిందాల్‌ సంస్థలు ఒక అవగాహనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ముందు కాకినాడ సెజ్‌ కోసం ఎఎస్‌ఆర్‌ సంస్థ ప్రయత్నించింది. సజ్జన్‌ జిందాల్‌ కొన్ని నెలల క్రితం సిఎం జగన్‌తో భేటీ తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అందులో భాగంగా కాకినాడ సెజ్‌తో పాటుగా గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్ట్‌ కూడా జెఎస్‌డబ్ల్యుకు అప్పగించేందుకు ఉన్నత స్థాయిలో వ్యవహారాలు సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏళ్లు గడుస్తున్నా కాకినాడ సెజ్‌లో ప్రస్తుతం పది ఎకరాల విస్తీర్ణంలోనైనా కార్యకలాపాలు కనిపించడం లేదు. చైనాకు చెందిన పల్స్‌ ఫ్లష్‌ అనే సంస్థ బొమ్మల తయారీ యూనిట్‌ కొంతకాలం నడిపి మూసివేసింది. ప్రస్తుతం మూడు ఆక్వా ప్రొడక్ట్‌ ప్రోసెసింగ్‌ యూనిట్లు మాత్రమే నడుస్తున్నాయి. రూ.1000 కోట్లతో 600 ఎకరాల్లో బల్క్‌ డ్రగ్‌ యూనిట్‌ని అరబిందో నిర్మిస్తోంది. వచ్చే ఏడాది దీన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.