మెగా ఈవెంట్లకు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడతోంది. స్టార్ ప్లేయర్స్ జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ప్రస్తుతం బెంగళూరులోని నెషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీలంక, పాకిస్తాన్‌ల వేదికగా జరగనున్న ఆసియాకప్ సమయానికి వీరు ముగ్గురూ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారని అంతా భావించారు. అయితే జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ ఆసియాకప్‌తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండగా.. కేఎల్ రాహుల్ మాత్రం కోలుకోవడానికి మరో రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఒక వేళ ఇదే జరిగితే భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు కూడా రాహుల్ దూరమయ్యే ఛాన్స్ ఉంది.










