Oct 19,2023 12:26
  • కాటారంలో సభలో బీజేపీ, బీఆర్‌ఎస్‌పై రాహుల్‌ ఫైర్‌

కాటారం: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కాటారంలో గురువారం ఉదయం జరిగిన సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ఇవాళ ఉదయం భూపాలపల్లి నుండి కాటారం వరకు బస్సులో రాహుల్‌ గాంధీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్‌ మాట్లాడుతూ..కేసీఆర్‌ అవినీతిపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదని బీజేపీని ప్రశ్నించారు. కేసీఆర్‌ అవినీతిపై ఈడీ, సీబీఐ ఎందుకు ఫోకస్‌ పెట్టలేదన్నారు. కేసీఆర్‌ తన అవినీతిని పక్క రాష్ట్రాలకు కూడ విస్తరించారని ఆయన ఆరోపించారు. దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలో ఉందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతి కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్‌పై ఎలాంటి చర్యలు లేవన్నారు. కానీ తనపై బీజేపీ సర్కార్‌ ఇరవైకి పైగా కేసులు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు. మీ ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో కేసీఆర్‌ ఓటమి ఖాయంగా కన్పిస్తుందన్నారు. దొరల తెలంగాణకు , ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం సాగుతుందని రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు.పదేళ్లుగా కేసీఆర్‌ ప్రజలకు దూరమౌతూ వస్తున్నారని రాహుల్‌ గాంధీ విమర్శించారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని రాహుల్‌ గాంధీ విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు.
అదానీ లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారన్నారు.అదానీ తీసుకున్న అప్పులను కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ మాఫీ చేసిందన్నారు. స్వయం ఉపాధి కోసం మహిళలు తీసుకున్న అప్పులను మాత్రం బీజేపీ సర్కార్‌ మాఫీ చేయలేదని ఆయన విమర్శించారు.ప్రజలు కొనుగోలు చేసే ప్రతి వస్తువులపై జీఎస్టీ పేరుతో పన్ను వసూలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రజల నుండి వసూలు చేసిన పన్నులను అదానీకి కట్టబెడుతున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.కర్ణాటకలో రైతులకు రుణమాఫీ చేసినట్టుగా రాహుల్‌ గాంధీ చెప్పారు.కర్ణాటకలో మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు.