ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : 352 సర్వే నెంబరులో భూములపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించి కబ్జాకు గురైన బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే.అజరు బాబు కోరారు. మంగళవారం సీపీఐ బృందం భూములను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాలుగా సాదాపురం గ్రామ పంచాయతీలో గల 352 సర్వే నెంబరు గల కొంత భూమి వివాదాస్పద వ్యక్తుల మధ్య తరచు వార్తలలోనూ సోషల్ మీడియా ద్వారా కబ్జాలకు గురి అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. పాలకులు, ప్రభుత్వ అధికారుల వైఫల్యంతో నిజమైన లబ్ధిదారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఒకే ప్లాటును ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల నష్టపోయిన లబ్ధిదారులు దిక్కు తోచని స్థితిలో మధ్యవర్తులను ఆశ్రయిస్తే న్యాయం చేయాల్సిందిపోయి సెటిల్మెంట్ చేయడం భావ్యం కాదన్నారు. ఎవరైతే డబల్ రిజిస్ట్రేషన్ చేయించిన వారిపై చర్యలు తీసుకొని ఈ భూ వివాదానికి కారణమైన 352 సర్వే నెంబరులపై విచారణ జరిపించాలన్నారు. లేనిపక్షంలో లబ్ధిదారులను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే లక్ష్మారెడ్డి, సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు యసు సుదర్శన్, కల్లుబావిరాజు, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి బి ఎంకన్న జిల్లా సహాయ కార్యదర్శి ఓ బి నాగరాజు పాల్గొన్నారు.










