న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో తాను జారీ చేసిన ఉత్తర్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు కలవరపరిచిందో తనకు తెలియదని ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్.మురళీధర్ అన్నారు. ఆ ఏడాది ఫిబ్రరి 26న మురళీధర్ నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు బెంచ్ ఆ నెల ప్రారంభంలో నగరం అనుభవించిన మతపరమైన అల్లర్లపై దర్యాప్తు చేస్తున్న తీరుపై బహిరంగ కోర్టులో ఢిల్లీ పోలీసులను మందలించింది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) మద్దతుదారులు, చట్టాన్ని వ్యతిరేకించే వారి మధ్య ఘర్షణలు చెలరేగాయి. కనీసం 53 మంది వ్యక్తులు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. హింసలో మరణించిన వారిలో ఎక్కువ మంది ముస్లిములే కావటం గమనార్హం. ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి బిజెపి నేతలపై 24 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయాలని పోలీసులను అప్పట్లో మురళీధర్ ఆదేశించారు. బెంగళూరులో ఒక న్యూస్ వెబ్‌సైట్ నిర్వహించిన ఒక కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.










