బెంగళూరు : వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కర్ణాటకలో జెడి(ఎస్), బిజెపి మధ్య పొత్తు ఖరారైంది. జెడిఎస్‌కు 4 స్థానాలు కేటాయించేందుకు బిజెపి అంగీకరించింది. బిజెపి నేత, కర్ణాటక మాజీ సిఎం బిఎస్ యడ్యూరప్ప శుక్రవారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో బిజెపి, జెడి(ఎస్) మధ్య పొత్తు ఖరారైందని తెలిపారు. జెడి(ఎస్)కు నాలుగు లోక్‌సభ సీట్లు ఇచ్చేందుకు అమిత్ షా అంగీకరించారని ఆయన చెప్పారు. జెడి(ఎస్) అధినేత హెచ్‌డి దేవెగౌడ ఇటీవల బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. బిజెపి, జెడి(ఎస్) మధ్య పొత్తు గురించి ఈ సందర్భంగా ఒక స్పష్టత వచ్చింది. మాండ్య, హసన్, బెంగళూరు (రూరల్), చిక్‌బల్లాపూర్ స్థానాలను జెడి(ఎస్) కోరింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మొత్తం 28 ఎంపి స్థానాల్లో బిజెపి సొంతంగా 25 స్థానాల్లో గెలిచింది. స్వతంత్ర అభ్యర్థి విజయానికి సహకరించడం ద్వారా 26 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్, జెడి(ఎస్) చెరొక సీటులో విజయం సాధించాయి. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయం పాలైన సంగతి విదితమే.










