విశ్వం అంటేనే వింత.. విశేషం. అంతలోనే భూకంపాలు, సునామీలు, మరెన్నో ప్రమాదాలతో భయానకం. ఏదేమైనా నిత్యం కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉంటాయి. సైన్సు అంటేనే ప్రయోగం.. నిజం.. నిరూపించడం.. మరి ఆ పరిశోధనలలో వెల్లడైనదే ఇప్పటి ఐదో పొర విషయం. అదేనండీ.. ఇప్పటివరకూ భూమి నాలుగు పొరలను కలిగి ఉందని శాస్త్రవేత్తలు భావించారు. ఇటీవల భూకంపాల తాకిడి ఎక్కువై, విపరీతంగా జన నష్టం కలుగుతోంది. ఆ విషయమై చేస్తున్న పరిశోధనల్లో భూమి లోలోపల మరొక పొర ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాని గురించి భూకంప శాస్త్రవేత్తలు తెలిపిన వివరాలు..
ఇప్పటివరకు భూమి నిర్మాణంలో నాలుగు విభిన్న పొరలున్నాయని పరిశోధకులు భావిస్తూ వచ్చారు. అవి క్రస్ట్, మాంటిల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. అయితే ఇటీవల ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన భూకంప శాస్త్రవేత్తలు ఐదవ పొర కూడా ఉందని గుర్తించారు. ఈ పొర 650 కి.మీ. మందంతో ఉన్న 'ఘన రూపంలో ఉన్న లోహ గోళం' రూపంలో, నాల్గవ పొర అయిన ఇన్నర్ కోర్ మధ్యలో నిక్షిప్తమైనట్లు గుర్తించారు. ఈ సమాచారమంతా జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించబడింది.
- ఉనికి 20 ఏళ్ల క్రితమే..

'అయితే ఈ మెటాలిక్ బాల్ ఉనికి సుమారు 20 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తల అంచనాకు వచ్చింది. ఇప్పుడు నిర్ధారణ అయింది' అని రీసెర్చ్ స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌కు చెందిన థాన్-సన్ ఫామ్, హ్వ్రౌజే తకల్సిక్‌ల బృందం చెబుతోంది. 'ఈ అంతర్గత పొర భూమి పరిణామ చరిత్ర, కాలం గురించి మరింత సమాచారాన్ని అందించగలదని వారు వ్యాఖ్యానించారు. అంటే ఇది వందల మిలియన్ల.. బిలియన్ల సంవత్సరాల క్రితం వరకూ భూమిపై జరిగిన అనేక సంఘటనల సూచికగా ఉపయోగపడే శిలాజ రూపంలోని రికార్డు అని చెప్పవచ్చు' అని అభివర్ణించారు థాన్‌సన్.
- అలస్కాలో అథ్యయనం..

అలస్కాలో సంభవించిన భూకంప ప్రదేశాన్ని శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసింది. 'భూకంప కేంద్రం నుంచి నేరుగా భూకంప తరంగాలు దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రం గుండా భూమి అవతలి వైపుకు దూసుకెళ్ళి, మరల వెనుదిరిగి భూకంప కేంద్రం వద్దకు చేరాయి' అని పరిశోధకులు వెల్లడించారు. 'భూకంపం ఏర్పడిన ప్రదేశం నుండి సరిగ్గా ఎదురుగా భూమి ఉపరితలం వైపు ప్రయాణించాయి. దీనిని యాంటీపోడ్ అంటారు. యాంటీపోడ్ నుండి తిరిగి భూకంప కేంద్రానికి ప్రయాణించాయి. భూమి వ్యాసం వెంబడి ఐదుసార్లు ముందుకు, వెనుకకు భూకంప తరంగాలు ప్రయాణించాయి. ఈ సమాచారమంతా భూకంప తరంగాల నుండి వచ్చిన డేటా ఆధారంగా సేకరించినదే. మునుపటి అధ్యయనాలు గమనిస్తే ఒక్క యాంటీపోడల్ తరంగాలను మాత్రమే నమోదు చేశాయి' అని ఫామ్ వివరించారు.
- మరిన్ని రహస్యాల ఛేదన..

'ఈ లోహ గోళం ఇనుము, నికెల్ మిశ్రమంతో కూడి ఉంది. భూమి లోపలి పదార్థాల గుండా భూకంప తరంగాలు వేగంగా దూసుకెళ్ళడం, నెమ్మదించడం అనిసోట్రోఫీ ఆధారంగా గుర్తించాం' అని పరిశోధకులు వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలు, పీడనాల వద్ద ఇనుప పరమాణువుల అమరిక, స్ఫటికాల పెరుగుదల వలన ఇది సంభవించి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. వివిధ కోణాల నుండి భూమి మధ్యలో ఉన్న ప్రదేశాలను పరిశీలించినప్పుడు వేర్వేరు సమయాలలో వచ్చిన భూకంప తరంగాల ప్రయాణ దిశల్లో వైవిధ్యాన్ని గుర్తించారు. ఈ విశ్లేషణలో ఇన్నర్ కోర్ లోపలి ప్రాంతం, బయటి పొరకు భిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. 'భూమి అంతర్భాగం గురించి మరెన్నో సమాధానాలు లేని ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు గుర్తింపబడిన ఐదో పొర ద్వారా భూమి నిర్మాణంలో దాగిన మరిన్ని రహస్యాలను వెలికి తీసేందుకు సహాయ పడుతుందని భావిస్తున్నాం' అని తకల్సిక్ చెప్పారు.

భౌగోళికంగా భూమి తీరప్రాంతాలలో భూకంపాలు సహజంగా వస్తూంటాయి. అయితే ఇటీవల మానవాళి ఉపయోగించే కొన్ని వస్తువులు భూమి, నీరు, గాలి, సహజ వనరుల సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. దాంతో ప్రకృతి వైపరీత్యాలు అసహజ రీతిలో మనకు ఎదురవుతున్నాయి. వాటిని అరికట్టే దిశగా మన జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తరాలకు మరింత కష్టతరమైన పరిస్థితులు ఎదురవుతాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ పరిస్థితులకు అనుగుణంగా మన జీవనశైలిని మార్చుకుందాం.










