Sep 19,2023 11:53

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఐదురోజులపాటు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో సంవత్సరాలగా ఆమోదం పొందని మహిళా రిజర్వేషన్‌ బిల్లుని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ సోనియాగాంధీ మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై స్పందించారు. మంగళవారం పార్లమెంటులో అడుగుపెట్టిన సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆమెను మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'మహిళా రిజర్వేషన్‌ బిల్లు మాది. యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేము తీసుకొచ్చాము.' అని ఆమె అన్నారు. అలాగే మంగళవారం పార్లమెంట్‌ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుని ప్రవేశపెడితే.. యుపిఎ ప్రభుత్వంలోని కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాల విజయమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం అన్నారు.
కాగా, యుపిఎ ప్రభుత్వం హయాంలో 2010 మార్చి 9న రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందింది. కానీ లోక్‌సభలో మాత్రం ఈ బిల్లుపై చర్చకు రాలేదు.