ఏకరూప పౌరస్మృతి.. గత కొన్ని వారాలుగా దేశమంతటా వినిపిస్తున్న మాట. భోపాల్ సభలో ప్రధాని బహిరంగ ప్రకటన చేసినప్పటి నుండి దేశంలో కుల, మత, ప్రాంతీయతకు అతీతంగా అనేకమంది మేధావులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు.. ఆందోళన చేస్తున్నారు. ఎటువంటి ముసాయిదా అంశాలూ వెల్లడించకుండా.. లా కమిషన్‌కు అభిప్రాయాలను చెప్పమనడం హాస్యాస్పదంగా ఉంది. భిన్న జాతులు, సంస్కృతులు, మతాలు, వివిధ భాషలు, ఆచార వ్యవహారాలున్న ఈ దేశానంతటికీ ఒకే చట్టం తీసుకురావడం సాధ్యమా? అనే విషయమై ఇప్పుడు దేశమంతటా చర్చ నడుస్తోంది. దీనిపై మేధావులు, వివిధ సామాజిక తరగతుల నుండి అభిప్రాయాలను తెలుసుకోవడానికే ఈ చర్చ.
ఈ వారం...ఈ చర్చలో కొందరి అభిప్రాయాలు ఇస్తున్నాం. - సంపాదకులు
విస్తృత చర్చ లేకుండా ఎలా ?
'నీటిలో గేదెను ఉంచి బేరమాడినట్టుంది' ఏకరూప పౌర స్మృతి గురించి మాట్లాడ్డం. అసలు బిల్లులో ఏముందో ఎంతమందికి తెలుసు? ఈ పౌరస్మృతి అంటే ఏమిటి?. ఏకరూప పౌరస్మృతి అనడానికీ బాగుంది, వినడానికీ బాగుంది.. కానీ ఆ చట్టంలో పొందుపరిచిన అంశాల గురించి తెలిసిన వారెందరు? ఏముందో తెలీకుండా అభిప్రాయాలు ఎలా చెప్తారు?
'ఒకే దేశం ఒకే చట్టం' అనడం అంటే దేశంలో అందరికీ ఒకే చట్టం అని. నిజంగా దేశంలో ప్రజలందరూ ఆర్థికంగా, సామాజికంగా సమానంగా ఉన్నారా? ప్రజలందరూ సమంగా గౌరవించబడుతున్నారా? కట్టు బొట్టు, వేషం, భాష, సంస్కృతీ సంప్రదాయాలు ఒకేలా ఉన్నాయా? అసలు అలా ఉండడం సాధ్యమేనా? అనేక అసమానతలతో సతమతమౌతున్న సమాజంలో 'ఏకరూప పౌరస్మతి' ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు?
భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న జాతులు, వివిధ భాషలు, ఆచార వ్యవహారాలు గల సువిశాల భారత దేశానికి ఒకే చట్టం వర్తింపజేయడం అంత సులువైన పని కాదని చాలా మంది అభిప్రాయం. అన్ని మతాలలోనూ ఎక్కువ తక్కువల భావనలున్నాయి. భిన్నమైన ఆచార సంప్రదాయాలున్నాయి. అన్నింటినీ సమన్వయం చేసుకుని ఏకరూప పౌరస్మృతి నిర్ణయించడం అంత సులువైన పనికాదు
ప్రతి మతానికీ పర్సనల్ లా ఉన్నప్పుడు, ఆయా 'పర్సనల్ లా' అనుసరిస్తున్న వారి అభిప్రాయాలను గౌరవిస్తూ, వారి వారి మత విశ్వాసాలకు విలువనిస్తూ గౌరవిస్తూ చట్టాన్ని తీసుకురావాలంటే ఆయా మతాలకు చెందిన మేధావుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతెందుకు, గిరిజన తెగల్లో వారి ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, వివాహాలు, విడాకులు వంటివి ప్రత్యేకమైనవి. ఈ విషయాల్లో ఏకరూప పౌరస్మృతి వైఖరేమిటి?

'ఏకరూప పౌరస్మృతి' చట్టం కోసం మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తుందంటే రాజకీయ లబ్దికోసం కాకపోతే ఎన్నికల ముందు ఎందుకు తెరమీదకి తెస్తుంది? అనే ప్రశ్న ప్రజలకు రావడం సహజమే. 'ఒక మతాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకున్న వారు ఆ రాజకీయ ప్రయోజనం కోసమే ఇప్పుడీ చట్టం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని' జనం అనుకుంటే.. అది వారి తప్పని అనలేం. ఆ అనుమానాల్ని నివృత్తి చేసి బిల్లులో ఏముందో సాధారణ ప్రజానీకానికి కూడా తెలియాల్సి ఉంది. చాలమంది విద్యాధికులకే ఈ బిల్లు పట్ల స్పష్టత లేదు.
వివిధ మతాచారాల్లో మూఢాచారాలను తొలగించే విధంగా చట్టం చేయడం స్వాగతించదగ్గదే. వివాహాలు, విడాకులు, దత్తత, వారసత్వం వంటి విషయాల్లో ఆయా మతాలు అనుసరించే 'పర్సనల్ లా' అందరికీ ఒకేలా ఉండదు. చాలా వరకు ఆయామతాల వారు అనుసరించే ఆచార సంప్రదాయాల్లో వ్యత్యాసాలు, తొలగి, మత విశ్వాసాల్ని గౌరవిస్తూనే మూఢాచారాల్ని తొలగించి.. పురుషులు, మహిళలు అనే వివక్ష లేకుండా అన్ని మతాలలోనూ మహిళలు స్వేచ్ఛా సమానత్వాలను పొందే విధంగా ఈ పౌరస్మతి ఉంటుందా? కొన్ని మతాలలో మహిళలకు పునర్వివాహ హక్కు లేదంటారు. ఆ హక్కు ఈ చట్టం ద్వారా సాధ్యపడుతుందా? భారత రాజ్యాంగ నిర్మాత ఆశించిందీ, రాజ్యాంగం కోరుకున్నదీ, ఇప్పుడు కావాలనుకుంటున్న ఈ పౌరస్మృతి 'భావనలో', 'ఆచరణలో' ఒకటే అవుతుందా? ఈ పౌరస్మృతి చట్టం చేయడం ద్వారా దేశంలో మైనారిటీలకు నష్టమేమీ జరగదని హామీ ఉందా?
ఇలా ప్రజల్లో అనేక సందేహాలున్నాయి. 'మా భద్రత పట్ల భయాలున్నాయి' అని కొందరు భావిస్తున్న మాట నిజం. వారి భద్రతకు హామీ ఉందా? అవి నివృత్తయితే తప్ప స్పష్టత రాదు. 'ఒకే దేశం ఒకే చట్టం' అనే శీర్షిక బాగుందిగానీ లోపలి విషయం ఏమిటో తెలీనప్పుడు గందరగోళం తప్పదు. మత విశ్వాసాలకు భంగం కలగకుండా, అందరికీ అనుకూలమైన పౌరస్మృతి కోసం తొందరపడకుండా తగినంత సమయం తీసుకోవాలి. విస్తృతమైన చర్చ జరిగిన తరువాత మాత్రమే ఒక నిర్ణయానికి రావలసిన అవసరం ఉంది. ఏ చట్టమైనా ప్రజా సమూహాల సంక్షేమం కోసమే చేయాలి తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం కాకూడదు.

గంటేడ గౌరినాయుడు ప్రముఖ రచయిత, పార్వతీపురం మన్యం జిల్లా.
ఇది విద్రోహ చర్య
రాజకీయ దురుద్ధేశ్యంతోనే ఏకరూప పౌరస్మృతిని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశ ప్రజల మధ్య ఐక్యత లేకుండా విభజన కోసం ఇంతకుముందు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో కొత్తగా మరొకసారి పౌర సత్వ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. పౌరస్మృతిని సంస్కరించాల్సిన అవసరం ఉంది. అయితే ఏకత్వం కాకుండా సమానత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకుని రావాలి. స్త్రీలకు జరుగుతున్న అన్యాయం మతాలకతీతంగా ఉంది. అన్ని మతాలను లింగ వివక్ష లేకుండా.. అన్ని తరగతులు, అన్ని రకాల ప్రజల కోసం సంస్కరణలు తీసుకురావడం అవసరం. భిన్న సంస్కతులు, భిన్న జాతులున్న భారతదేశంలో ప్రజలను చైతన్యవంతం చేస్తూ సంస్కరణలు తీసుకురావడం అవసరం. ముసాయిదా తీర్మానం, అసలు పౌరసత్వం అంటే ఏమిటో తెలియకుండా.. ఎలాగైనా దీనిని తీసుకుని రావాలనుకోవడం మోసపూరితమైన విద్రోహ చర్య. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చర్యను ప్రజలందరూ వ్యతిరేకించాలి.

చంద్రశేఖర్ మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు, అనంతపురం.
మత వ్యవస్థగా మార్చే కుట్ర
కేంద్ర పాలనలో ఉన్న కాషాయ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల్లో ముఖ్యమైనవి మూడు ఉన్నాయి. 1. రామ జన్మభూమి నిర్మాణం, 2. కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తికి సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేయడం 3. పౌరులందరికీ ఏకరూప పౌరస్మృతి
పైన పేర్కొన్న వాటిలో మిగిలి ఉన్నది ఏకరూప పౌరస్మృతి మాత్రమే. ఇది భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఈ సూత్రాల్లో ఆధికరణ 38 ప్రకారం అన్ని రంగాల్లో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయాన్ని పెంపొందించే వ్యవస్థను ప్రభుత్వం సమకూర్చాలి. అలాగే రాబడిలో ఆసమానతలను తగ్గించడానికి, ప్రజల మధ్య అసమానతలను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. భారత రాజ్యాంగం అధికరణ 39 ప్రకారం స్త్రీ, పురుష తేడా లేకుండా పౌరులకు చాలినంత జీవనోపాధి కల్పించాలి. సామాన్యులకు హాని కలగకుండా ఉత్పత్తి సాధనాలు వికేంద్రీకరిస్తూ ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం. బాలలు ఆరోగ్యకర, గౌరవ ప్రదమైన ఆవరణలో పెరిగే అవకాశం కల్పించడం వంటివి.
స్త్రీ, పురుషులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించడం వంటివి ఆదేశిక సూత్రాలలో అనేక ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలున్నప్పటికీ, వాటిని పక్కన పెట్టి, మైనారిటీలు, ఆదివాసీల సాంప్రదాయాల మీద దృష్టి కేంద్రీకరించి, వారి హక్కులను హరించాలని కాషాయ ప్రభుత్వం ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఏకరూప పౌరస్మృతి పెట్టడానికి సమాజం ఆ స్థితిలో అభివృద్ధి చెందలేదు. వివక్ష, దోపిడీ, నిరుద్యోగం ఇంకా సమాజంలో కొనసాగుతున్న నేటి పరిస్థితులలో ఆ సమస్యలను పరిష్కరించకుండా ఏకరూప పౌరస్మృతిని ప్రవేశపెట్టాలని ఆలోచించడం అవివేకం. లౌకిక వ్యవస్థను మత వ్యవస్థగా మార్చడానికి చేసే కుట్రలో భాగమే ఈ ఏకరూప పౌరస్మృతి

ముప్పాళ్ల సుబ్బారావు, ఎపి బార్ కౌన్సిల్ సభ్యుడు. రాజమహేంద్రవరం .










