Oct 22,2023 21:13

- ఎండిన వరి పంటల పరిశీలన
ప్రజాశక్తి-వంగర (విజయనగరం జిల్లా):తోటపల్లి ప్రాజెక్టు కుడి కాలువ శివారు ఆయకట్టుకు తక్షణమే సాగునీరు అందించి, వంగర మండల రైతులను ఆదుకోవాలని సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విజయనగరం జిల్లా వంగర మండలంలోని ఎం.సీతారాంపురం, మద్దివలస, కొత్తవలస, వంగర, తలగాం, శివ్వాం గ్రామాల్లో ఆదివారం సిపిఎం బృందం పర్యటించింది. సాగునీరందక ఎండిపోతున్న వరిపొలాలను పరిశీలించింది. పిచ్చిమొక్కలతో నిండిపోయిన సాగునీటి కాలువలను బృందం సభ్యులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సాగునీరులేక ఇబ్బందులు పడుతుంటే అధికారులుగానీ, ప్రజా ప్రతినిధులుగానీ పంటలను పరిశీలించలేదని తెలిపారు. సమస్యలను అడిగే వారు కరువయ్యారని సిపిఎం బృందం ముందు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.
అనంతరం తమ్మినేని మాట్లాడుతూ సాగునీరు అందకపోవడంతో వరి పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. మడ్డువలస ప్రాజెక్టు, నాగావళి, వేగావతి, సువర్ణముఖి నదులు ఉన్నప్పటికీ వంగర మండల రైతులకు సాగునీరు అందించకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. పంటలు ఎండిపోయి రైతులు గగ్గోలు పెడుతుంటే అధికారులెవరూ ఇంతవరకు పంటలను పరిశీలించి, రైతులకు ధైర్యం చెప్పకపోవడం దారుణమన్నారు. తక్షణమే వరగరను కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఈ నెల 25న తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మరడాన త్రినాథరావు, వియ్యపు లక్ష్మునాయుడు, గడసాన దుర్గారావు పాల్గొన్నారు.