మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ సవాల్ విసరబోతున్నదా.. అనే చర్చ నడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ఆధ్వర్యంలో రూపొందిన యాప్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. మార్క్ జుకర్ బర్గ్ సారధ్యంలోని మెటా.. సెలెక్టెడ్ సెలబ్రిటీలు, క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లతో ప్రయోగాత్మకంగా ఈ యాప్‌ను కొన్ని నెలలుగా పరీక్షిస్తున్నది.
ఇన్‌స్టా ఆధ్వర్యంలో వచ్చే ఈ యాప్... తొలుత టెక్ట్స్ ఆధారిత యాప్‌గా రానున్నది. ఆ తర్వాత వీడియోలు, ఫొటోలను కూడా అప్‌లోడ్ చేసుకోగలిగే విధంగా అప్‌డేట్ చేస్తారని తెలుస్తున్నది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు వెలుగు చూడటంతో దీనిపై జరుగుతున్న చర్చకు బలం చేకూరింది. దీనికి అధికారికంగా ఇంకా ఎటువంటి పేరును ఖరారు చేయనప్పటికీ... ఇంటర్నల్‌గా పీ92, బార్సిలోనా అనే పేర్లతో పిలుస్తున్నారు. త్వరలోనే ట్విట్టర్‌కు పోటీగా ఈ యాప్ అందుబాటులోకి వస్తుందని వినికిడి.
మెటా రూపొందించిన మైక్రో బ్లాగింగ్ సైట్ యాప్.. ఇన్‌స్టాగ్రామ్‌ను పోలి ఉంటుందని సమాచారం. అయితే, ఈ యాప్‌లో ఫొటోలు, వీడియోలకు బదులు టెక్ట్స్ ఆధారిత టైమ్‌లైన్ పోస్ట్‌లు కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అయ్యేవారు ఇన్‌స్టాను క్లిక్ చేస్తే, కొత్త యాప్‌లోనూ ఫాలో అయ్యేలాంటి సౌలభ్యాన్ని మెటా కల్పిస్తున్నదని టెక్ వెబ్‌సైట్లలో, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.










