- ప్రతిపక్షాల ఫోరం సమన్వయ కమిటీ తొలి భేటీలో నిర్ణయం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, బిజెపి ప్రభుత్వ అవినీతిపై అక్టోబర్ మొదటి వారంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తొలి బహిరంగ సభ జరిపేందుకు ప్రతిపక్షాల ఇండియా ఫోరం సమన్వయ కమిటీ నిర్ణయించింది. బుధవారం నాడిక్కడ ఎన్సిపి అధినేత శరద్ పవార్ నివాసంలో ఇండియా ఫోరం సమన్వయ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 12 పార్టీల నుంచి శరద్ పవార్ (ఎన్సిపి), డి.రాజా (సిపిఐ), హేమంత్ సోరెన్ (జెఎంఎం), కెసి వేణుగోపాల్ (కాంగ్రెస్), టిఆర్ బాలు (డిఎంకె), తేజస్వి యాదవ్ (ఆర్జెడి), సంజరు రౌత్ (శివసేన), సంజరు ఝా (జెడియు), జావెద్ అలీ (ఎస్పి), రాఘవ్ చడ్డా ( ఆప్), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తి (పిడిపి) నేతలు పాల్గొన్నారు. బిజెపి, ప్రధానమంత్రి ప్రతీకార రాజకీయాల కారణంగా ఈడి సమన్ల వల్ల టిఎంసి నేత అభిషేక్ బెనర్జీ, ఇతర వల్ల జెడియు నేత లలన్ సింగ్ హాజరుకాలేదు.
సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలందరతో కలిసి కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ సీట్ల పంపకానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని సమన్వయ కమిటీ నిర్ణయించిందన్నారు. పార్టీలతో చర్చలు జరిపి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించిందన్నారు. కూటమి పార్టీలు ఏవీ తమ ప్రతినిధులను మీడియా చర్చలకు పంపకూడదని, ఎవరి షోలలో ఎవరి పాల్గొనే ప్రతినిధుల పేర్లను నిర్ణయించే అధికారం మీడియా కో-ఆర్డినేషన్ కమిటీ సబ్ గ్రూప్ కు ఇచ్చినట్లు తెలిపారు.










