Jul 20,2023 07:24
  • రాత్రి 7.30గం||ల నుంచి

ట్రినిడాడ్‌: తొలిటెస్ట్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇక సిరీస్‌పై కన్నేసింది. రెండు టెస్ట్‌మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డొమెనిక వేదికగా జరిగిన తొలిటెస్ట్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తుచేసింది. ఈ క్రమంలో రెండోటెస్ట్‌లోనూ గెలిచి ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ సర్కిల్‌లో మెరుగైన రన్‌రేట్‌కోసం ప్రయత్నిస్తోంది. ఈ టెస్ట్‌ మ్యాచ్‌లోనూ భారత్‌ గెలిస్తే సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకోనుంది. తొలిటెస్ట్‌లో అరంగేట్రం యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ 171పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఇక బౌలింగ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ 12 వికెట్లు తీశాడు. దీంతో రెండోటెస్ట్‌కు భారత్‌ పెద్దగా మార్పుల్లేకుండానే బరిలోకి దిగే అవకాశముంది. మరోవైపు వెస్టిండీస్‌ జట్టు అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో నిరాశపరుస్తోంది. తొలి టెస్ట్‌ కేవలం మూడురోజుల్లోనే ముగియడంతో కనీసం ఈ టెస్ట్‌లోనైనా భారత్‌కు గట్టి పోటీనివ్వాలని భావిస్తోంది.