Jul 26,2023 14:46
  • నేడు బిసిసిఐ అత్యవసర సమావేశం

ముంబయి: భారత్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగే ఐసిసి వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌ రీషెడ్యూల్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరుజట్ల మధ్య అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌ వేదికగా ప్రపంచకప్‌ లీగ్‌ పోటీ జరగాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల రీత్యా ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేసే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం గుజరాత్‌ వ్యాప్తంగా నవరాత్ర ఉత్సవాలు అదేరోజు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేయాలని గుజరాత్‌ పోలీస్‌ అధికారులు బిసిసిఐకి సూచించినట్లు ఓ పత్రిక కథనం. 'మేం దీనిపై మా వద్ద ఉన్న ఆప్షన్ల గురించి చర్చిస్తున్నాం. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగే ప్రతిష్టాత్మక మ్యాచ్‌ కోసం భారీ సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్‌కు తరలివస్తారు. ఓ పక్క నవరాత్రి ఉత్సవాలు, మరోవైపు మ్యాచ్‌తో తమపై భారం పెరుగుతుందని భద్రతా ఏజెన్సీలు మాకు సూచించాయి.' అని ఓ బిసిసిఐ అధికారి మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్ర అసోసియేషన్‌లతో జూలై 27(నేడు) ఢిల్లీలో బిసిసిఐ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. బిసిసిఐ సెక్రటరీ జైషా ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలోనే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కొత్త తేదీని నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒక రోజు ముందు అక్టోబర్‌ 14న నిర్వహించాలని బిసిసిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.