న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా న్యూయార్క్‌లో వాతావరణ సదస్సు (సిఎఎస్) జరిగింది. దీనికి ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన భారత్, అమెరికా, చైనాలు హాజరు కాలేదు. మొత్తంగా ప్రపంచ కాలుష్య కారక వాయువుల్లో 42శాతం వాటాను కలిగిన, భవిష్యత్‌లో ప్రపంచ కాలుష్య మొత్తాలను గణనీయంగా ప్రభావితం చేయగల ఈ మూడు దేశాలు ఈ సదస్సుకు హాజరు కాకపోవడం గమనార్హం.
పారిస్ ఒప్పందంలో లక్ష్యంగా పెట్టుకున్న 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ పరిమితిని అలాగే కొనసాగించేందుకు, వాతావరణ న్యాయం అందచేసేందుకు నేతలు తమ విశ్వసనీయమైన చర్యలు, విధానాలు, ప్రణాళికల ద్వారా నిబద్ధతను ప్రకటించేందుకు ఈ వాతావరణ సదస్సు ఉద్దేశించబడిందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కార్యాచరణను వేగవంతం చేయాలంటూ సదస్సుకు ముందు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ ఇచ్చిన పిలుపునకు స్పందించి దాదాపు వంద దేశాల అధినేతలు లేఖ రాశారు. సదస్సు జరిగే తేదీకి మాత్రం కేవలం 34 దేశాల, ఏడు సంస్థల ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. భారత్ పొరుగుదేశాలైన శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్‌లు కూడా వక్తల జాబితాలో వున్నాయి. వర్ధమాన ఆర్థిక వ్యవస్థలైన దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లు కూడా హాజరయ్యాయి. పోడియంలో యురోపియన్ యూనియన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడాలు వున్నాయి.










