న్యూఢిల్లీ : కెనడా, భారత్‌ల మధ్య ఖలీస్తానీ చిచ్చు మరింత ఉద్రికత్తమవుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. అయితే కెనడా చర్యకు ప్రతి చర్యగా భారత్ కూడా స్పందించింది. ఇందుకు ప్రతిగా భారత్ కెనడా సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటించింది. దీంతో భారత్ దెబ్బకు దెబ్బ తీసినట్లైంది.
కాగా, ట్రూడో ప్రభుత్వం భారత దౌత్యవేత్తను బహిష్కరించడంపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. కెనడా సీనియర్ దౌత్యవేత్త బహిష్కరణ గురించి తెలియజేసేందుకు భారతదేశంలో కెనడా రాయబారి కామెరూన్ మెక్‌కేని విదేశాంగ శాఖ పలిపించింది. సంబంధిత దౌత్యవేత్త 5 రోజుల్లో భారత్ విడిచివెళ్లిపోవాలని కోరింది. ''మా అంతర్గత విషయాల్లో కెనడియన్ దౌత్యవేత్తల జోక్యం, భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలలో వారి ప్రమేయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది'' అని ఓ ప్రకటనలో భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
ఢిల్లీలో ఇటీవల జరిగిన జి 20 సమావేశాల్లో ఖలిస్తాన్ సానుభూతిపరులపై కెనడా ప్రభుత్వం చూపుతున్న ఉదారవాదాన్ని మోడీ విమర్శించారు. ఇలా విమర్శించిన తర్వాత కెనడా ప్రభుత్వం భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ట్రేడ్ మిషన్‌కి బ్రేక్ పడింది.
అంతకుముందు కెనడా పార్లమెంట్‌లో ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో మాట్లాడుతూ.. 'హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపించారు. అలాగే అక్కడ భారత దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు కెనడా విదేశాంగ శాఖ ప్రకటించింది. కెనడా ప్రభుత్వ ఆరోపణల్ని భారత్ తప్పుపట్టింది. అసంబద్ధమైన ఆరోపణలుగా భారత్ ఖండించింది.
పంజాబ్‌లోని జలంధర్‌కి చెందిన నిజ్జర్ 1997లో కెనడాకు వెళ్లాడు. పంజాబ్ వేరు చేసి సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలని నిజ్జర్ పలుమార్లు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఉగ్రవాద కుట్రలకు పాల్పడ్డాడు. 2007లో పంజాబ్‌లోని జరిగిన ఓ బాంబు దాడిలో నిజ్జర్ నిందితుడిగా ఉన్నాడు. దీంతో భారత ఉగ్రవాద నిరోధక ఏజెన్సీ నిజ్జర్‌పై 10 లక్షల రివార్డ్‌ని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జూన్ నెలలో ఆయన్ను కెనడా సర్రే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.










