హిందూపురం (అనంతపురం) : విద్యారంగ సమస్యను పరిష్కారం చేయాలంటూ ... కలెక్టరేట్ కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా జరగనివ్వకుండా ముందస్తు అరెస్టులను చేయడాన్ని ఖండిస్తూ హిందూపురం పట్టణంలో అంబేద్కర్ సర్కిల్లో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ .... రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. విద్యార్థులకు పెండింగులో ఉన్న జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి బకాయిలు విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెండింగులో ఉన్న బకాయిలు విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని, పెండింగ్లో ఉన్న మిస్ కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుకునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ప్రభుత్వమే ఉచితంగా అందించాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని, పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే జీఓ నెంబర్ 77 రద్దు చేయాలని, నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌లతో తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించకుండా చేయడం కోసం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కఅషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చంద్రశేఖర్, హర్ష కుమార్, భగత్ ఇంతియాజ్, గణేష్, సల్మాన్ ఇమ్రాన్, అరుణ్, ప్రవీణ్, మనోజ్ మోమిన్ పాల్గొన్నారు.










