- సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులు
- జీతాలు చెల్లించాలని తాగునీటి సరఫరా కార్మికుల ఆందోళన
ప్రజాశక్తి-ఉరవకొండ(అనంతపురం) : కార్మికులకు జీతాలు చెల్లించకపోతే వారి కుటుంబాలు గడిచేదేలా అని సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులు అధికారులను ప్రశ్నించారు. సత్య సాయి శ్రీ రామిరెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పనిచేస్తున్న కార్మికులకు దాదాపు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో శనివారం ఉరవకొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించి.. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులకు మద్దతుగా పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులు మాట్లాడుతూ.. సత్య సాయి, శ్రీరామ్ రెడ్డి తాగునీటి సరఫరా పథకంలో దాదాపు 600 మంది కార్మికులు గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని అయితే వారికి సకాలంలో జీతాలు, పీఎఫ్‌లు చెల్లించకుండా ప్రభుత్వము కాలయాపన చేస్తుందని దీనివల్ల కార్మికుల యొక్క బతుకుతెరువు భారంగా మారిందన్నారు. 600 మంది కార్మికులకు దాదాపు నాలుగు నెలలుగా జీతాలు, పిఎఫ్‌లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. గత 18 రోజులుగా కార్మికులు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని చివరిగా కార్మికులు సమ్మెలోకి వెళ్లారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటి తహశీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రంగారెడ్డి, కార్మికులు, ఆ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










