Nov 08,2023 15:45

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌: త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని బిఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ఓటుకు చాలా విలువ ఉంటుందని.. ఆషామాషీగా వేయొద్దని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. ''2004 ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఎన్నికలు అవగానే ఇచ్చిన హామీని ఆ పార్టీ విస్మరించింది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో అన్నట్లు నేను పోరాడాను. బిఆర్‌ఎస్‌ పోరాటానికి భయపడి కాంగ్రెస్‌ ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత భూముల ధరలు పెరిగాయి. రాష్ట్రంలో తండాలకు సైతం శుద్ధమైన నీరు వస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నాం. రాష్ట్రంలో ఒక్కో విద్యార్థిపై రూ.1.25లక్షలు ఖర్చు పెడుతున్నాం.
రైతులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో రైతుబంధు ఇస్తున్నాం. భూ వివాదాలు ఉండకూడదనే ధరణి పోర్టల్‌ తీసుకొచ్చాం. కాంగ్రెస్‌ హయాంలో లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం ఎలాంటి లంచాలు ఇవ్వకుండానే అర్ధగంటలో అవుతున్నాయి. రైతులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే రైతుబంధు ఇస్తున్నాం. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోళ్ల డబ్బులు ఎలా వస్తాయి?ధరణి తీసేస్తే రైతులకు భూములపై ఉన్న హక్కులు పోతాయి. మళ్లీ దళారుల వ్యవస్థ వస్తుంది'' అని కేసీఆర్‌ అన్నారు.