ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో: మాజీ ఎంపి, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటి, ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్, ఖమ్మంలోని పొంగులేటి నివాసాలకు గురువారం వేకువజామున మూడు గంటలకే చేరుకున్న ఐటి, ఇడి బృందాలు విస్తృతంగా తనిఖీలు చేశాయి.ఎనిమిది వాహనాల్లో వచ్చిన అధికార బృందాలు మూకుమ్మడిగా లోపలికి ప్రవేశించి కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. గురువారం నామినేషన్ వేసేందుకు పొంగులేటి సిద్ధమవుతున్న సమయంలోనే సోదాలు జరగటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నివాసంలో బుధవారం పోలీసులు సోదాలపై స్పందిస్తూ, తన నివాసాల్లోనూ ఐటి దాడులు చేయవచ్చని పొంగులేటి ముందే పసిగట్టారు. ఈ పరిణామాలపై పొంగులేటి స్పందిస్తూ దీంతో బిఆర్‌ఎస్, బిజెపి స్నేహం ఏ విధంగా ఉందో అందరికీ అర్ధమైందన్నారు. దాడులతో కాంగ్రెస్ నాయకులను భయపెట్టలేరని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క తెలిపారు.










