న్యూఢిల్లీ : తమపై చేసిన ఆరోపణలకు గాను బిజెపి ఎంపి మేనకా గాంధీకి ఇస్కాన్ సంస్థ రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు పంపించింది.గోశాలలోని గోవులను ఇస్కాన్ కబేళాలకు విక్రయిస్తోందని మేేనకా గాంధీ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ ఆరోపణలను ఇస్కాన్ ఇప్పటికే ఖండించింది. మేనకాగాంధీ ఆరోపణలపై కోల్‌కతాలోని ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ మాట్లాడుతూ..'మేనకా గాంధీ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తులు, మద్దతుదారులు, శ్రేయాభిలాషుల మనసును నొప్పించాయి. ఇస్కాన్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న ఎవరినీ వదిలి పెట్టం. న్యాయం కోసం పోరాడతాం. మేనకాగాంధీకి ఈ రోజు రూ.వంద కోట్ల పరువు నష్టం నోటీసు పంపాం. ఆమె ఎటువంటి ఆధారాలు లేకుండా మా సంస్థపై ఆరోపణలు చేశారని' అన్నారు.
'ఇస్కాన్ గోవులను గోశాలల నుంచి కబేళాలకు విక్రయిస్తోంది. దేశంలోనే ఇది అతి పెద్ద మోసం. ప్రభుత్వం నుంచి భారీగా భూములను సేకరించిన ఇస్కాన్ గోశాలలను ఏర్పాటు చేసింది. భారీ ప్రయోజనాలను పొందిన ఆ సంస్థ చివరకు గోవులను వధకు తరలిస్తోంది. ఇటువంటి పని ఎవరూ చేయరు' అని మేనకా గాంధీ పేర్కొంటున్న వీడియో ఒకటి వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
ఈ ఆరోపణలను ఇస్కాన్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో తాము గోవులను రక్షిస్తున్నామని, గో మాంసం విక్రయించే దేశాల్లోనూ వాటికి రక్షణ కల్పిస్తున్నామని పేర్కొంది. 'భారత్‌లో 60 గోశాలలను నిర్వహిస్తున్నాం. వందల ఆవులు, ఎద్దులను రక్షిస్తున్నాం. శ్రద్ధగా వాటి పోషణ చూస్తున్నాం. ప్రజలు వదిలేసిన, గాయపడిన గోవులు కబేళాలకు తరలకుండా తీసుకొచ్చి సపర్యలు చేస్తున్నాం' అని ఇస్కాన్ ఒక ప్రకటన విడుదల చేసింది.










