- శాకాహారులకు ప్రత్యేక టేబుల్స్ ఏర్పాటుపై నిరసన ఫలితం
ముంబయి : శాకాహార భోజనం చేసే వారికి ప్రత్యేక టేబుల్స్ ఏర్పాటుచేయడాన్ని వ్యతిరేకించినందుకు ఓ విద్యార్థికి ఐఐటి బాంబే పదివేల రూపాయల జరిమానా విధించింది. మూడు హాస్టళ్లకు చెందిన ఉమ్మడి క్యాంటీన్‌లో మాంసాహారం తినని వారి కోసం ఆరు టేబుల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఐఐటి మెస్ కౌన్సిల్ గత వారం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాకాహారులకు కేటాయించిన ఓ టేబుల్‌పై గత నెల 28న కొందరు విద్యార్థులు మాంసాహారాన్ని భుజించారు. తమ నిరసనను ఈ-మెయిల్ రూపంలో అధికారులకు తెలియజేశారు. విద్యార్థుల నిరసనను మెస్ కౌన్సిల్ ప్రస్తావిస్తూ 'ఈ చర్య భోజనశాలలో శాంతియుత వాతావరణానికి, సామరస్యానికి విఘాతం కలిగించేదిగా ఉంది. విద్యార్థి వ్యవహారాల అసోసియేట్ డీన్ సలహాను ధిక్కరించేదిగా ఉంది' అని తెలిపింది. ఇది ఆధునిక కాలంలో అంటరానితనాన్ని ప్రోత్సహించేదిగా ఉన్నదని అంబేద్కర్ పెరియార్ పూలే స్టడీ సర్కిల్ విమర్శించింది. బాంబే ఐఐటిలోని భోజనశాలలో శాఖాహారులకు అనధికారికంగా కొంత ప్రదేశాన్ని కేటాయించడంపై జూలైలోనే వివాదం చెలరేగింది.










