Aug 09,2023 21:57
  • అక్టోబర్‌ 14న భారత్‌-పాక్‌ ఢీ
  • తాజా వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసిసి

లండన్‌: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ తాజా షెడ్యూల్‌ను ప్రకటించింది. భారత్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌నుంచి జరిగే వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌లో ఐసిసి ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా కొన్ని మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు చోటు చేసుకోవడంతో ఐసిసి బుధవారం అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించింది. అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న జరగాల్సిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సహా మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు జరిగాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 15న జరగాల్సిన ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉండగా.. ఒక రోజు ముందుకు(అక్టోబర్‌ 14) మారింది. కాగా, భారత్‌ వేదికగా ఐసిసి వన్డే ప్రపంచకప్‌ అక్టోబర్‌ 5న ప్రారంభమై.. నవంబర్‌ 19న ముగుస్తుంది. టోర్నీ ప్రారంభ, ఫైనల్‌ మ్యాచ్‌లతోపాటు భారత్‌-పాక్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌.. రన్నరప్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది.
మార్పులు, చేర్పులు జరిగిన మ్యాచ్‌ల వివరాలు..

  •  ఢిల్లీ వేదికగా అక్టోబర్‌ 14న జరగాల్సిన ఆఫ్ఘనిస్తాన్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌ ఓ రోజు తర్వాత (అక్టోబర్‌ 15)
  •  అక్టోబర్‌ 12న హైదరాబాద్‌లో జరగాల్సిన పాకిస్తాన్‌-శ్రీలంక మ్యాచ్‌ అక్టోబర్‌ 10న,
  •  అక్టోబర్‌ 13న లక్నోలో జరగాల్సిన ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్‌ అక్టోబర్‌ 12న,
  •  చెన్నై వేదికగా న్యూజిలాండ్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య అక్టోబర్‌ 14న జరగాల్సిన మ్యాచ్‌ అక్టోబర్‌ 13న,
  •  ధర్మశాల వేదికగా నవంబర్‌ 11న ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరగాల్సిన డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ అదే రోజు (నవంబర్‌ 11) డే మ్యాచ్‌ (10:30)గా,
  •  ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్‌ మధ్య నవంబర్‌ 12 పూణే వేదికగా జరగాల్సిన మ్యాచ్‌ నవంబర్‌ 11కు,
  •  ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా నవంబర్‌ 12న జరగాల్సిన మ్యాచ్‌ నవంబర్‌ 11కు,
  •  భారత్‌-నెదర్లాండ్స్‌ మధ్య బెంగళూరు వేదికగా నవంబర్‌ 11న జరగాల్సిన మ్యాచ్‌ నవంబర్‌ 12వ తేదీకి మారింది.