Sep 10,2023 14:31

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌(కర్నూలు) :చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆధోని టిడిపి ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అధ్వర్యంలో స్థానిక ఎన్టీరామారావు విగ్రహం వద్ద టిడిపి నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, సీనియర్‌ నాయకులు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని,14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిపై ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి సైకో ఆనందం పొందడం అది జగన్కే చెందిందని అన్నారు. రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థ కూడా జగన్‌ రెడ్డి సైకో నిజాన్ని సాటిస్ఫై చేయడంలో నిమగం అయ్యిందని పేర్కొన్నారు. జగన్మోహన్‌ రెడ్డి తను అధికారం చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు టిడిపి శ్రేణులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో దానిపైనే దృష్టి పెట్టినట్లు విమర్శించారు. ఇంకో ఆరు నెలల్లో టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కర్నూలు జిల్లా పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి భూపాల్‌ చౌదరి, కార్యకర్తలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.