May 23,2023 15:55

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : జిల్లాలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, అత్యుత్తమ పనితీరు కనబరిచిన వాలంటీర్లను సన్మానించే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ పి.రాజాబాబు అధికారులు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌ అపరాజిత సింగ్‌, డిఆర్‌వోయం వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటన, జగనన్న ఆణిముత్యాలు, వాలంటీర్లకు వందనం, మిషన్‌ లైఫ్‌, గృహ నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సోమవారం జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అంకితభావంతో కృషి చేసి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా విజయవంతం చేశారని అందరిని అభినందించారు. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం చాలా గొప్ప విషయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం కింద పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల్లో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఈనెల 25వ తేదీన నియోజకవర్గ స్థాయిలో, ఈనెల 27వ తేదీన జిల్లా స్థాయిలో సన్మానించడానికి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. అలాగే వాలంటీర్లకు వందనం కార్యక్రమం కింద అత్యుత్తమ పనితీరు కనపరచిన వాలంటీర్లను కూడా సత్కరించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మిషన్‌ లైఫ్‌ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. పర్యావరణాన్ని పెంపొందించే దిశగా వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పలు పోటీలను నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. ఈ వారం అంతా గహ నిర్మాణ వారోత్సవాలుగా పరిగణించాలని ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను భాగస్వాములు చేస్తామన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు తదితర క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.