Sep 11,2023 11:57

గువహటి :   కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ తన పేరును మార్చుకోవాలని అసోం ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గువహటిలోని బిజెపి మహిళా మోర్చా కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు యత్నిస్తోందని అన్నారు. గాంధీ కుటుంబం సర్దార్‌ ఆఫ్‌ డూప్లికేట్‌ అని, వారు చాలా కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గాంధీ అనే బిరుదుతోనే వారి మొదటి కుంభకోణం ప్రారంభమైందని,వారు కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తూ.. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. గాంధీ బిరుదును ఇవ్వాలని తాను రాహుల్‌గాంధీని అభ్యర్థిస్తున్నానని అసోం ముఖ్యమంత్రి హిమంత శర్మ పేర్కొన్నారు.
25ఏళ్ల, 50 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కాంగ్రెస్‌ జరపలేదని అన్నారు. కానీ మోడీ 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుతున్నారని, దీంతో ప్రతి ఒక్కరూ భారతీయులమని గర్వంగా భావించేలా చేస్తున్నారని అన్నారు. భారత్‌ను విశ్వగురువుగా నిలిపేందుకు ప్రధాని మోడీ కృషిచేస్తున్నారని అన్నారు.