ప్రస్తుతం సినిమాల ట్రెండ్ మారుతోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ థియేటర్లకు సమాంతరంగా ఓటీటీ వేదికలూ సినిమాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో రోజు రోజుకూ ఓటీటీల్లో సినిమాలు చూసే వారి సంఖ్యా గణనీయంగా పెరుగుతోంది. దీంతో భాషతో సంబంధం లేకుండా ఏ భాషా చిత్రాన్నైనా చూసేస్తున్నారు ప్రేక్షకులు. దీంతో నేరుగా ఓటీటీల్లోనూ అనేక చిత్రాలు విడుదలవుతున్నాయి. అలా విడుదలైన వాటిల్లో తాజాగా ప్రేక్షకులను అలరించిన చిత్రం 'చోర్ నికల్ కే భాగా'. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం హైజాక్ థ్రిల్లర్ స్టోరీతో తీశారు. ఇంతకీ ఈ సినిమా కథేంటి? దీని టాక్ ఏంటి? తెలుసుకుందాం..!
కథలోకి వెళ్తే.. అంకిత్ (సన్నీ కౌశల్) ఓ వ్యాపారవేత్త. విదేశాల నుంచి తీసుకొచ్చే వజ్రాలకు ఇన్సూరెన్స్ చేసే కంపెనీని నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలోనే తరచూ విదేశాలకు వెళ్లి వస్తుంటాడు. ఓసారి ఎయిర్ హోస్టెస్ నేహా గ్రోవర్ (యామీ గౌతమ్) పరిచయమవుతుంది. అది కాస్తా ప్రేమగా మారి, డేటింగ్.. నేహా ప్రెగెంట్ అయ్యేంత వరకూ వెళ్తుంది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. సరిగ్గా అదే సమయానికి కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి మోసం చేసి, రూ.20 కోట్ల విలువైన వజ్రాలను కొట్టేస్తాడు. దీంతో ఆ మొత్తాన్ని కట్టమని వజ్రాల వ్యాపారి అంకిత్‌పై ఒత్తిడి తెస్తాడు. దీనికితోడు అంకిత్‌ని.. ఓ వ్యక్తి దగ్గర వజ్రాలు దొంగతనం చేయాలని కొందరు బెదిరిస్తుంటారు. ఈ విషయం నేహాకి చెబితే అనుకోని పరిస్థితుల్లో ఆమె కూడా ఒప్పుకుంటుంది. అలా విమానంలో రూ.120 కోట్ల విలువగల వజ్రాలను కొట్టేయాలని వీళ్లిద్దరూ పక్కా ప్లాన్ వేస్తారు. ఇక అంతా సెట్, కొట్టేద్దాం అనుకునే టైంలో ఫ్లైట్ హైజాక్ అవుతుంది. ఈ హైజాక్ నుంచి అంకిత్, నేహా, ఇతర ప్రయాణికులు ఎలా బయటపడ్డారు? మరి అంకిత్-నేహా వజ్రాలు దొంగతనం చేశారా? అసలు ఫ్లైట్ హైజాక్ చేసింది ఎవరు? చివరకు ఏం జరిగింది? అనేదే మిగతా కథ..

ఇతర దేశాల నుంచి వస్తున్న పౌరులు, ప్రయాణికులను బంధించి ఉగ్రవాదులు తమ డిమాండ్‌లను నెరవేర్చుకోవడం, అమాయక ప్రజలను కాపాడేందుకు పోలీసులు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు రంగంలోకి దిగి ఆపరేషన్లు నిర్వహించడం నేపథ్యంతో అన్ని భాషల్లోనూ సినిమాలు వచ్చాయి. చివరి వరకూ ఉత్కంఠగా సాగే ఇలాంటి సినిమాలు మంచి థ్రిల్‌ను పంచుతాయి. ఇప్పుడు అజరుసింగ్ దర్శకత్వంలో వచ్చిన 'చోర్ నికల్ కె భాగా' కూడా అలాంటిదే. మొదటి నుంచి చివరివరకూ ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేస్తూ అలరించడంలో దర్శకుడు అజరు విజయం సాధించారు. తీవ్ర గాయాలైన అంకిత్‌ని 'రా' అధికారులు విచారించడంతో కథ ప్రారంభమవుతుంది. అతడు ఎవరు? అసలు దెబ్బలు ఎందుకు తగిలాయి? ఎవరు కొట్టారు? అని ఒక్కో పాయింట్‌ని రివీల్ చేస్తూ వెళ్లారు. ఫస్టాఫ్ అంతా కూడా అంకిత్-నేహా లవ్ స్టోరీ, ఫ్లైట్ హైజాక్‌కావడం లాంటివాటితో ఫాస్ట్‌గా వెళ్లిపోతుంది.
అక్కడి నుంచి అంకిత్, నేహాల పరిచయం, ప్రేమతో తదితర సన్నివేశాలతో కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది. అసలు పాయింట్‌కు రావడానికి కాస్త సమయం పడుతుంది. ఎప్పుడైతే అంకిత్, నేహాలు వజ్రాలను మార్చేయాలని ప్లాన్ వేస్తారో అప్పటి నుంచి కథ, కథనం పరుగులు పెడుతుంది. విమానం హైజాక్ అయిన తర్వాత వచ్చే ప్రతి ట్విస్ట్ మెప్పిస్తుంది. అసలు ప్రేక్షకుడికి ఊహకు ఏమాత్రం అందని రీతిలో కథనాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ద్వితీయార్ధంలో ఒక్కో ముడిని విప్పుతుంటే భలే ఆసక్తిగా ఉంటుంది.
'చోర్ నికల్ కే భాగా' లోని అంకిత్, నేహా పాత్రల్లో సన్నీ కౌశల్, యామీ గౌతమ్ బాగా నటించారు. ఈ ఇద్దరి పాత్రలను చిత్రంలో చాలా వైవిధ్యంగా ప్రదర్శించారు. ఫస్టాఫ్‌లో అంకిత్-నేహా వజ్రాలు దొంగతనం చేయడం చూసి అయ్యో పాపం అనుకుంటాం. సెకండాఫ్‌కి వచ్చేసరికి మొత్తం మన ఆలోచననే వీళ్లిద్దరూ మార్చేస్తారు. వాళ్ల క్యారెక్టర్స్‌లో అలాంటి డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే యామీ గౌతమ్ మొత్తం సినిమాకే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఎయిర్‌హోస్టెస్, ప్రేమికు రాలిగా చాలా అద్భుతంగా నటించింది. 'రా' అధికారిగా నటించిన శరద్‌కేల్కర్ ఉన్నంతలో బాగా నటించాడు. మిగతావాళ్లంతా తమ తమ రోల్స్‌కు న్యాయం చేశారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. విశాల్ మిశ్రా సంగీతం, జియాన్నీ సినిమాటోగ్రఫీ బాగుంది. చారు టక్కర్ ఎడిటింగ్ సూటిగా, క్లుప్తంగా ఉంది. దర్శకుడు అజరుసింగ్ రాసుకున్న హైజాక్ అనే పాయింట్ పాతదే అయినా, దానికి అదనపు హంగులు, ట్విస్ట్‌లు జోడించి, తెరకెక్కించిన తీరు బాగుంది. ముఖ్యంగా ఓటీటీని దృష్టిలో పెట్టుకునే సినిమాను తీర్చిదిద్దిన విధానం అలరిస్తుంది. ఎక్కడా అసభ్యతకు తావు లేదు. ఈ వీకెండ్‌లో కుటుంబంతో కలిసి ఏదైనా ఆసక్తికర సినిమా చూడాలంటే 'చోర్ నికల్ కె భాగా' బెస్ట్ ఛాయిస్. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.










