Nov 05,2023 11:27
  • అంబేద్కర్‌ జిల్లా గోడి హాస్టల్‌లో దారుణ పరిస్థితులు
  • జిల్లా ప్రధాన జడ్జి నివేదికతో ప్రభుత్వంపై సీరియస్‌
  • తక్షణమే వసతుల కల్పనకు ఆదేశం

ప్రజాశక్తి, అమరావతి : రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, వసతి గహాల్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని గోడి గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 400 మంది విద్యార్థులకు రెండే టాయిలెట్స్‌ ఉన్నాయంటూ న్యాయవాది పి. బాబ్జి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ఇటీవల విచారించింది. విద్యార్థులకు బెడ్స్‌ లేకపోవడంతో నేలపైనే నిద్రపోతున్నారంటూ జిల్లా చీఫ్‌ జడ్జి ఇచ్చిన రిపోర్టును చూసి హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. హాస్టల్‌లో కనీస వసతులు కల్పించాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 8కి వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ లాయర్‌ ఎ.సత్యప్రసాద్‌ వాదిస్తూ, దోమల వల్ల విద్యార్థులు తీవ్ర అనారోగ్య సమస్యలపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేదన్నారు. ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించా లని గతంలోనే హైకోర్టు, రాజమహేంద్రవరంలోని జిల్లా చీఫ్‌ జడ్జిని ఆదేశించింది.
 

                                                                   400 మందికి రెండే టాయిలెట్స్‌

'సుమారు 400 మంది విద్యార్థులకు రెండే టాయిలెట్స్‌ ఉన్నాయి. మూత్ర విసర్జనశాలలు కూడా ఎనిమిదే ఉన్నాయి. తగిన నీటి వసతులు కూడా లేవు. 102 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. (జ్వరం, దగ్గు, చర్మ సమస్యలతో 102 మంది బాధపడుతున్నారు.) పడకలు కూడా లేవు. నేలపైనే నిద్రపోతున్నారు. దుప్పట్లు కూడా లేవు. ఇంటర్‌ చదివే వాళ్లకు ట్రంక్‌ పెట్టెలు కూడా ఇవ్వలేదు. తలుపులు, కిటికీలు కూడా సరిగ్గా లేవు. కరెంటు తీగలు వేలాడుతూ ఉన్నాయి. ఫ్యాన్లు, కరెంటు లైట్లు కూడా కొన్ని చోట్ల లేవు. నీళ్లు తాగేందుకు గ్లాసులు కూడా లేవు. ఒక్క టేబుల్‌ కూడా లేదు..'' తదితర సమస్యలపై నివేదికను జిల్లా ప్రధాన జడ్జి హైకోర్టుకు అందజేశారు.
 

                                                                          తక్షణ చర్యలకు ఆదేశం

నివేదికను పరిశీలించిన హైకోర్టు, విద్యార్థులకు మంచి బెడ్స్‌ ఏర్పాటు చేయాలి. శుద్ధి నీటి సరఫరా ఏర్పాట్లు చేయాలి. మరుగుదొడ్ల సంఖ్య పెంచాలి. మురుగునీరు లేకుండా చర్యలు తీసుకోవాలి. విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలి. ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. ఆహార ప్రమాణాలు పెంచాలి. జిల్లాకు ఒకసారి జిల్లా సోషల్‌ వెల్‌ఫేర్‌ ఆఫీసర్‌ హాస్టల్‌కు వెళ్లి పరిస్థితులను పరిశీలించాలి. హాస్టల్‌ను నిర్వహిస్తున్న సొసైటీ సమర్పించే లెక్కలపై ఆడిట్‌ చేయించాలి. తప్పులు చేసినట్లు తేలితే చట్ట ప్రకారం సొసైటీలోని బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. అని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. చర్యల రిపోర్టును తదుపరి విచారణ నాటికి అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.