ప్రజాశక్తి-మోపిదేవి (కృష్ణా) : మండల కేంద్రమైన మోపిదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి వి. గోపాలకృష్ణారావు బుధవారం దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన న్యాయమూర్తికి ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా దేవస్థానానికి వచ్చిన న్యాయమూర్తి ఆలయ ఆవరణలో ఉన్న నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీస్వామిని దర్శించుకోగా ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయమూర్తి దంపతులను ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ప్రసాదాలు, శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేసి, ఆలయ మర్యాదలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎక్సైజ్ కోర్టు జడ్జి డి మేరీ, తహశీల్దార్ కూరపాటి నవీన్ కుమార్, ఆలయ సూపరింటెండెంట్ బప్పన సత్యనారాయణ, సిహెచ్.పద్మ, తదితరులు పాల్గొన్నారు.










