ఈ కాలం అమ్మాయిలకు కనెక్టయ్యే సినిమా 'హలో మీరా'. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలకు ప్రేమ, పెళ్లి విషయాల్లో ఒక స్పష్టత లేకపోతే ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో దర్శకుడు శ్రీనివాసు సింగిల్ పాత్రలో చూపించారు. అదే క్రమంలో ఆడపిల్లకు ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రులు, కుటుంబం ఎలా అండగా నిలబడాలో చాలా చక్కగా చెప్పారు. జీవితంలో అనుకోకుండా సమస్యలు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని, ఎక్కడా మనల్ని మనం తక్కువగా చేసుకోకూడదని చివరిగా సందేశం ఇచ్చారు.
తెలుగులో ప్రయోగాత్మక కథా చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రం హలో మీరా. ఇది సింగిల్ పాత్రతో రూపొందిన సైకిలాజికల్ డ్రామా చిత్రం. సింగిల్ పాత్రతో చిత్రం చేయడం అంటే కత్తి మీద సామే. దర్శకుడు బాపు శిష్యుడు శ్రీనివాసు కాకర్ల తెరకెక్కించిన వైవిధ్యభరిత కథా చిత్రంగా 'హలో మీరా' నిలుస్తుంది. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా తన నటనతో, అభినయంతో, ఫోన్ సంభాషణలతో ఆకట్టుకుంది మీరా పాత్ర.
కథలోకి వెళితే.. మీరా (గార్గేయి) రెండేళ్ళుగా ప్రేమిస్తున్న కళ్యాణ్‌తో పెళ్లి కుదురుతుంది. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న ఆమె పెళ్లికి రెండు రోజులు క్రితం సొంతూరు విజయవాడ వెళ్తుంది. ఎల్లుండి పెళ్ళి అనగా హైదరాబాద్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్ నుండి ఫోన్ కాల్ వస్తుంది! గతంలో మీరా ప్రేమించిన సుధీర్ ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడని, సూసైడ్ నోట్‌లో ఆమె పేరు రాశాడని ఎస్.ఐ. విక్రమ్ చెబుతాడు. 'శుభమా అని పెళ్ళి చేసుకోబోతుంటే ఈ పాత ప్రేమ గొడవ ఏమిట్రా దేవుడా!' అనుకుంటుంది మీరా. తనకు సుధీర్‌తో ఎప్పుడో బ్రేకప్ అయిపోయిందని చెప్పినా ఎస్.ఐ. వినిపించుకోడు. అర్జెంట్‌గా హైదరాబాద్‌కు వచ్చి పోలీస్‌స్టేషన్‌లో రిపోర్ట్ చేయమని హుకుం జారీ చేస్తాడు. సుధీర్‌తో ప్రేమ గురించి ఫ్యామిలీ మెంబర్స్‌కు చెప్పడం ఇష్టంలేని మీరా హుటాహుటిన కారులో హైదరాబాద్ బయలుదేరుతుంది. సుధీర్ సూసైడ్ అటెమ్ట్‌కు కారణం ఏమిటీ? మీరా హైదరాబాద్ చేరే లోపు కథ ఎలాంటి మలుపులు తిరిగింది? ఇంతకూ కళ్యాణ్‌తో మీరా పెళ్ళి జరిగిందా? లేదా? అనేది మిగతా కథ.
సినిమా మొత్తం మీరాను మాత్రమే తెరపై చూపించారు. మీరా కాబోయే భర్త కళ్యాణ్, మీరా తల్లిదండ్రులు, స్నేహితులు, తమ్ముడు, అత్తా-ఆడపడుచు, పోలీసు అధికారులు, గూండాలు, టైలర్ మరియు అనేక ఇతర పాత్రలను మనం ఫోన్ల సంభాషణ ద్వారా వినవచ్చు. ఈ పాత్రల స్వరాలు భావోద్వేగాలను ప్రేక్షకుడు ఊహించగలడు. ఈ ప్రయత్నంలో మేకర్స్ మంచి విజయం సాధించారు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మీరా రాత్రిపూట ఒక్కతే బయలుదేరడం, దారి మధ్యలో కారు ఆగిపోవడం ఉత్కంఠభరితంగా కథ సాగుతుంది. తండ్రి ఆమెను అర్థం చేసుకుని అండగా నిలబడిన తీరు చాలా చక్కగా చూపించారు. స్నేహితుల సహాయం ఆమెకు ధైర్యాన్నిస్తుంది. కానీ కాబోయే భర్తకు చెప్పేందుకు భయపడుతుంది. చివరకు చెబుతుంది. సుధీర్ అనే వ్యక్తి ఎలాంటివాడో వివరిస్తుంది. కానీ కళ్యాణ్ రియాక్షన్ ఊహించని విధంగా ఉంటుంది. అత్తా అడపచుల సూటిపోటీ మాటలను తిప్పికొడుతుంది. పోలీసులకు వినయంగా సమాధానమిస్తుంది. చివరకు సుధీరే ఫోన్ చేసి మీరాకు క్షమాపణలు చెప్పడం, ఆమె సహాయం కోరడం జరుగుతుంది. ఇదే సినిమాలో ట్విస్ట్.
'ఎవ్వరికీ చెప్పొద్దు' సినిమాతో 2019లో తెరకు పరిచయమైంది గార్గేయి. ఆ తర్వాత కొన్ని చిన్న క్యారెక్టర్స్ చేసింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వస్తుంది. కొన్ని సీన్లలో గార్గేయి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్‌కు ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు.. 'హలో మీరా' సినిమాను ఎంజారు చేస్తారు.
నటీనటులు : గార్గేయి ఎల్లాప్రగడ
దర్శకుడు : శ్రీనివాసు కాకర్ల
నిర్మాణ సంస ్థ: లూమియర్ సినిమా
నిర్మాతలు : డాక్టర్ లక్ష్మణరావుదిక్కుల,
వరప్రసాదరావు దుంపల,పద్మకాకర్ల
సంగీతం : ఎస్.చిన్న










