Sep 15,2023 10:24
  • రన్‌వేపై రెండు ముక్కలైన విమానం

ముంబయి : ముంబయిలో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 18 వరకూ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం వర్షాల కారణంగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి ముంబయికి బయల్దేరిన విఎస్‌ఆర్‌ వెంచర్స్‌కు చెందిన ఓ ప్రైవేటు విమానం ఇక్కడ ల్యాండ్‌ అవుతుండగా.. ప్రమాదవశాత్తు రన్‌వేపై జారి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానం రెండు ముక్కలు కాగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారందరిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
             ముంబయిలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయని, 700 మీటర్లకు మించి కనిపించడం లేదని డిజిసిఎ వెల్లడించింది. రన్‌వే 27పై ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో కొద్దిసేపు మూసేశారు. దీంతో ఆ సమయంలో ముంబయిలో దిగాల్సిన ఐదు విస్తారా విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. సహాయక చర్యల అనంతరం.. డిజిసిఎ, ఎటిసి అనుమతితో రన్‌వే కార్యకలాపాలను పునరుద్ధరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
           గత వారం రోజులుగా ముంబయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒడిషా సముద్ర తీరంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం నుంచి ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 18 వరకూ ముంబయి, సమీప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.