9న విచారించనున్న అత్యున్నత న్యాయస్థానం
ప్రజాశక్తి- అమరావతి, న్యూఢిల్లీ :ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంగళవారం సుప్రీం కోర్టులో ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన బెంచ్ ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టుకు అందజేసిన కేసు రికార్డులన్నింటినీ తమకు అందజేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది.
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాల అభివృద్ధి కుంభకోణం కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, ఎ.ఎం.సింఘ్వి, సిద్ధార్ధ్ లూథ్రా వాదిస్తున్నారు. ఒకే క్లయింట్ తరపున ఇంతమంది న్యాయవాదులు వాదించేందుకు సాధారణంగా అనుమతించబోమని కోర్టు వ్యాఖ్యానించింది.
రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విధాన నిర్ణయాలకు సంబంధించిన కేసు ఇదని సాల్వె వాదించారు. అందువల్ల దీనిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టలేమని అన్నారు. 2015-16 బడ్జెట్‌లో నైపుణ్యాల అభివృద్ధి ప్రాజెక్టుకు కేటాయించిన రూ.360 కోట్ల కేటాయింపు కూడా వుంది. చంద్రబాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టడానికి ముందుగా అవినీతి నిరోధక చట్టంలోని 17ఎ సెక్షన్ కింద తప్పనిసరిగా తీసుకోవాల్సిన ముందస్తు అనుమతిని ప్రాసిక్యూషన్ తీసుకోలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అధికార విధుల్లో భాగంగా ప్రాజెక్టు చేపట్టాలన్న నిర్ణయం తీసుకున్నందున గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం అవసరమని లూథ్రా వాదించారు. ఎఫ్‌ఐఆర్‌లన్నీ దురుద్దేశంగా నమోదు చేసినవేనని బాబు న్యాయవాదుల బృందం పేర్కొంది. ''సరైన అథారిటీ ముందస్తు ఆమోద ముద్ర లేకుండా ఒక పబ్లిక్ సర్వెంట్ చేసిన విధి నిర్వహణపై ఏ పోలీసు అధికారి విచారణను లేదా దర్యాప్తును చేపట్టలేరు.'' అని సుప్రీంకోర్టులో బాబు దాఖలు చేసిన పిటిషన్ పేర్కొంది. నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్ నిబంధనల కింద విడిగా కేసులు నమోదైనపుడు సెక్షన్ 17ఎ రక్షణ వాటికి వర్తిస్తుందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్నగా వుందని కోర్టు పేర్కొంది. 2018 నాటి సవరణలో అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17ఎను ప్రవేశపెట్టినప్పుడు ఆ రక్షణ అనేది అంతకుముందు నమోదైన కేసుల్లో అంటే ఇక్కడ 2015 నాటి ఈ కేసులో వర్తిస్తుందా లేదా అన్న అంశంపై కూడా న్యాయస్థానం చర్చించింది.
ఎప్పుడో 21 మాసాల క్రితం నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పిటిషనర్ (నాయుడు) పేరు అకస్మాత్తుగా వచ్చిందని, పైగా అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన స్వేచ్ఛను హరించారని, ఇవన్నీ కూడా రాజకీయ కారణాలతోనే జరిగాయని స్పెషల్ లీవ్ పిటిషన్ పేర్కొంది. పిటిషనర్‌పై ఎలాంటి సాక్ష్యాధారాలు లేనప్పటికీ ఆయన్ని అక్రమంగా అరెస్టు చేసి, ప్రాధమిక హక్కులను ఉల్లంఘించి మరీ వేధిస్తున్నారని ఆ పిటిషన్ పేర్కొంది.
- ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తీర్పు రిజర్వు
ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పు పేరుతో భూ దోపిడీకి పాల్పడ్డారనే అభియోగాల కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వేసిన కేసులో హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు మంగళవారం పూర్తవ్వడంతో జస్టిస్ కె సురేష్‌రెడ్డి తీర్పును వాయిదా వేశారు.
- ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో 10న సిఐడి విచారణకు హాజరవ్వండి
- లోకేష్‌కు హైకోర్టు ఆదేశం
ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్పు చేశారనే అభియోగాలపై నమోదైన కేసులో ఈ నెల 10న సిఐడి నిర్వహించబోయే విచారణకు హాజరుకావాలని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు హైకోర్టు ఆదేశించింది. లోకేష్ విచారణకు హాజరయ్యేప్పుడు న్యాయవాదిని అనుమతించాలంటూ సిఐడికి పలు షరతులు విధించింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య విచారించాలని పేర్కొంది. మధ్యాహ్నం గంట సమయం భోజన విరామం ఇవ్వాలని చెప్పింది. ఫలానా డాక్యుమెంట్ తేవాలని కోరకూడదని న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు వ్యవహారంలో హెరిటేజ్ సంస్థకు చెందిన ఖాతా పుస్తకాలు, భూములు కొనుగోలు లావేదేవీల పత్రాలతో ఈ నెల 4న విచారణకు హాజరుకావాలంటూ లోకేష్‌కు సిఐడి సెక్షన్ 41(ఏ) కింద నోటీసు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
- నిందితుడే కాదు.. ముందస్తు బెయిలా? : సిఐడి
సిఐడి నమోదు చేసిన ఫైబర్ నెట్ కేసులో నారా లోకేష్ నిందితుడు కారని, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన కోరడాన్ని సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఒకవేళ లోకేష్‌ను సిఐడి నిందితుడిగా చేర్చితే సిఆర్‌పిసిలోని 41ఎ నోటీసు ఇచ్చాకే విచారణ జరుగుతుందని హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఈ వివరాలను జస్టిస్ కె సురేష్‌రెడ్డి రికార్డుల్లో నమోదు చేసుకుని లోకేష్ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై విచారణను మూసేస్తున్నట్లు ప్రకటించారు.
- ఇంటి వద్దనే విచారణ చేసేలా ఉత్తర్వులివ్వండి : మాజీమంత్రి పి నారాయణ
ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పుతో భూ దందాకు పాల్పడ్డారనే అభియోగాల కేసులో సిఐడి జారీ చేసిన 41ఎ నోటీసులను రద్దు చేయాలంటూ ఆ కేసులో నిందితుడైన మాజీ మంత్రి పొంగూరు నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. తను వృద్ధాప్యంతో ఉన్నానని, విచారణ చేయదలిస్తే ఇంటి వద్దనే చేసేలా సిఐడికి ఉత్తర్వులివ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను బుధవారం హైకోర్టు విచారించనుంది.










