మహిళా రిజర్వేషన్ చట్టం ఎప్పటికి అమలులోకి వస్తుందో తెలియదు
ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీమతి టీచర్, మరియం ధావలే
వివిధ ప్రజా సంఘాలు, సిపిఎం ఎంపీల సంఘీభావం
ప్రజాశక్తి -న్యూఢిల్లీ బ్యూరో:మహిళా వ్యతిరేకి బిజెపిని గద్దెదించాల్సిందేనంటూ దేశ రాజధాని ఢిల్లీలో వేలాది మంది మహిళలు గురువారం కదంతొక్కారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యాన గురువారం జంతర్ మంతర్లో నిర్వహించిన ''చలో ఢిల్లీ'' ర్యాలీకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ నలుమూలలకు చెందిన వేలాదిమంది మహిళలు హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి పాలన నుంచి మహిళలను, దేశాన్ని రక్షించాలని ఈ ర్యాలీనుద్దేశించి మాట్లాడిన వక్తలు పిలుపునిచ్చారు. బిజెపి - ఆర్‌ఎస్‌ఎస్ పాలనలోని మహిళా వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను బట్టబయలు చేస్తూ మూడు నెలల దేశవ్యాప్త ప్రచారం తరువాత మహిళలు రాజధానికి చేరుకున్నారు. జంతర్ మంతర్ వద్ద బహిరంగ సభకు ముందు దేశ రాజధానిలోని వివిధ ప్రదేశాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టారు. ప్లకార్డులు చేబూని మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు.
ర్యాలీలో ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పికె శ్రీమతి టీచర్, మరియం ధావలే మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ చట్టంతో మహిళలను మరోసారి మోసం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం ఎప్పటికి అమలులోకి వస్తుందో తెలియదని అన్నారు. 2014లో మహిళలను ఆకట్టుకునే వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన బిజెపి ఆ తరువాత వాటిని పూర్తిగా గాలికొదిలేసిందని అన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆకలి, హింసకు మహిళలే ఎక్కువగా బాధితులని తెలిపారు. వంట గ్యాస్ ధర పెంచి మహిళలకు బిజెపి మరిన్ని కష్టాలను తెచ్చి పెట్టిందని విమర్శించారు. మహిళలపై హింస, దాడులు పెరుగుతున్నాయని, ఎన్‌సిఆర్‌బి రిపోర్టులు కూడా దీనినే ధ్రువీకరిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రంలో, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలపై అవమానకరమైన, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అయినా, వారిపై చర్యలు లేవని అన్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేసే, వారిని రెండో తరగతి పౌరులుగా పరిగణించే ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతమైన మనువాదాన్ని ఓడించాలని అన్నారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మానవ హక్కులను కాలరాస్తోందన్నారు. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందనడానికి న్యూస్‌క్లిక్‌పై తాజాగా జరిగిన దాడులే ఒక నిదర్శనమన్నారు. క్రూరమైన ఉపా చట్టం కింద అరెస్టు చేసిన న్యూస్‌క్లిక్ జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశం నలుమూలల నుంచి కదలివచ్చిన మహిళలు కదనోత్సాహంతో ర్యాలీలో పాల్గన్నారు. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల, మహిళా వ్యతిరేక, విద్వేష రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని వారు పేర్కొన్నారు.
ఈ ర్యాలీని ఉద్దేశించి ఐద్వా ఉపాధ్యక్షురాలు సుభాషిణి అలీ, మాలినీ భట్టాచార్య, సుధా సుందరరామన్, కెకె శైలజ టీచర్, కోశాధికారి ఎస్.పుణ్యవతి, కేరళ రాష్ట్ర కార్యదర్శి సిఎస్ సుజాత, బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి కననైనికా ఘోష్, త్రిపుర రాష్ట్ర అధ్యక్షురాలు రమణి దేవ్‌వర్మ తదితరులు మాట్లాడారు. ఈ ర్యాలీకి ఎఐకెఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే, సిఐటియు అఖిల భారత కార్యదర్శి ఎఆర్ సింధు, డివైఎఫ్‌ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమఘ్నరాజ్ భట్టాచార్య, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ , ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను, సిపిఐ (ఎం) ఎంపీలు వి.శివదాసన్, ఎఎ రహీమ్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరుణ జ్వోతి, మల్లు లక్ష్మి, ఏపి నుంచి సత్యవతి, రమణి, పూర్ణ, శ్రీదేవి, ప్రియాంక, మస్తాన్‌బి పాల్గన్నారు. తొలుత జన నాట్య మంచ్ కళాకారులు ఆలపించిన గీతాలు ఆలోచింపజేశాయి.










